8 కేంద్రమంత్రి పదవులపై టీడీపీ కన్ను ?

by Hajipasha |
8 కేంద్రమంత్రి పదవులపై టీడీపీ కన్ను ?
X

దిశ, నేషనల్ బ్యూరో: సొంతంగా మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోకపోవడంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే బీజేపీకి జేడీయూ, టీడీపీల మద్దతు అనివార్యంగా మారింది. ఎన్డీయే కూటమిలో 16 లోక్‌సభ సీట్లతో రెండో అతిపెద్ద పార్టీగా టీడీపీ ఆవిర్భవించింది. ఈనేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీ, అమిత్ షాల ఎదుట కీలక డిమాండ్లు పెట్టబోతున్నారని జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 8 కేంద్రమంత్రి పదవులను ఆయన కోరే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి. ఈ లిస్టులో ఆరోగ్యశాఖ, వ్యవసాయ శాఖ, ఐటీ కమ్యూనికేషన్ల శాఖ, హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ, గ్రామీణ డెవలప్మెంట్ శాఖ, రోడ్డు రవాణా శాఖ , జలశక్తి శాఖ, విద్యాశాఖలు ఉన్నాయని జాతీయ మీడియా పేర్కొంటోంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పదవి, లోక్‌సభ స్పీకర్ పదవిని కూడా టీడీపీకి ఇవ్వాలని చంద్రబాబు కోరే ఛాన్స్ ఉందట. ఈ లెక్కన ప్రస్తుతం దక్కిన ఛాన్స్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకొని.. కేంద్ర సర్కారులో కీ రోల్ పోషించేందుకు చంద్రబాబు రెడీ అయ్యారని స్పష్టమవుతోంది.

నితీశ్ కొత్త డిమాండ్లు..

12 మంది ఎంపీల బలమున్న జేడీయూ.. నాలుగైదు కేబినెట్ బెర్తులతోపాటు అధిక కేంద్ర నిధులు, ముందస్తు అసెంబ్లీ ఎలక్షన్స్, బిహార్ కు స్పెషల్ స్టేటస్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రిజల్ట్ రాకముందే మూడు కేంద్రమంత్రి పదవులు, ఒక సహాయ మంత్రి పదవిని ఇస్తామని జేడీయూకి బీజేపీ హామీ ఇచ్చిందట. ప్రస్తుతం పరిస్థితులు వేరేగా ఉండడంతో మరో కేబినెట్ పదవి ఇవ్వాలని బీజేపీకి నితీశ్ సంకేతాలిచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రైల్వే, గ్రామీణాభివృద్ధి, జలవనరుల వంటి కీలక శాఖలను నితీశ్ డిమాండ్ చేస్తున్నారట. బిహార్ లో లోక్ సభ ఎన్నికల్లో మంచి రిజల్ట్స్ రావడంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని జేడీయూ భావిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనను బీజేపీ వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో బిహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా, బిహార్‌కు చెందిన లోక్‌ జనశక్తి పార్టీ (రాం విలాస్‌) కూడా ఐదు లోక్‌సభ స్థానాల్లో గెలిచి మంచి ప్రదర్శన కనబరిచింది. దీంతో ఆ పార్టీ కేంద్రంలో ఒక కేంద్ర మంత్రి, ఒక సహాయ మంత్రి పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed