Suvendu Adhikari: కోటి మంది హిందువులు భారత్‌కు వచ్చే చాన్స్.. బీజేపీ నేత సువేంధు అధికారి

by vinod kumar |
Suvendu Adhikari: కోటి మంది హిందువులు భారత్‌కు వచ్చే చాన్స్.. బీజేపీ నేత సువేంధు అధికారి
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో బీజేపీ నేత సువేంధు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండు మూడు రోజుల్లో బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్‌కు కోటి మంది హిందువులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. సీఎం మమతా బెనర్జీ ఇందుకు సన్నాహాలు చేయాలని తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలు హత్యకు గురవుతున్నారు. రంగ్‌పూర్‌లో కౌన్సిలర్‌ను చంపేశారు. సిరాజ్‌గంజ్‌లో13 మంది పోలీసులు మరణించగా.. వారిలో తొమ్మిది మంది హిందువులు ఉన్నారు. కాబట్టి మరికొన్ని రోజుల్లో పరిస్థితులు మెరుగుపడకపోతే.. కోటి మంది హిందువులు భారత్‌కు వస్తారు’ అని వ్యాఖ్యానించారు. సీఏఏలో పేర్కొన్నట్టుగా మత పరమైన హింసకు గురైన హిందువులకు మన దేశం ఆశ్రయం కల్పిస్తుందని గుర్తుచేశారు. కాబట్టి వారిని స్వాగతించేందుకు సీఎం మమతా బెనర్జీ, బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌లు సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవాలని తెలిపారు.

Next Story

Most Viewed