దోచుకున్న ఆయుధాలు అప్పగించండి

by John Kora |
దోచుకున్న ఆయుధాలు అప్పగించండి
X

- 7 రోజుల్లో సరెండర్ చేయకుంటే కఠిన చర్యలు

- మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌లో శాంతి స్థాపనకు కేంద్ర నడుం భిగించింది. రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్‌లో ప్రజలు గతంలో దోచుకున్న ఆయుధాలను ఏడు రోజుల్లోగా అప్పగించాలని గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఏడు రోజుల్లోగా తమ వద్ద ఉన్న అక్రమ ఆయుధాలు, దోచుకున్న ఆయుధాలను అప్పగిస్తే ఎలాంటి శిక్షలు విధించబోమని గురువారం తెలిపారు. అలా చేయకుంటే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. దాదాపు రెండేళ్లుగా రెండు వర్గాల జాతుల వైరం కారణంగా మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేయడం, బీజేపీలో సీఎం క్యాండిడేట్‌పై ఏకాభిప్రాయం కుదరక పోవడంతో రాష్ట్రపతి పాలన విధించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో సాధారణ స్థితిని పునరుద్దరించడానికి గవర్నర్ అజయ్ కుమార్ భల్లా చర్యలు చేపట్టారు.

రాష్ట్రంలో శాంతి పునరుద్దరణ జరిగి, ప్రజలు తమ సాధారణ రోజువారీ కార్యకలాపాలను తిరిగి కొనసాగించేందుకు వీలుగా అన్ని వర్గాలు వైరాన్ని వీడి శాంతి భద్రతలను కాపాడుకోవడానికి ముందుకు రావాలని గవర్నర్ కోరారు. శాంతి, మత సామరస్యతను దెబ్బ తీసే దురదృష్టకర ఘటనలతో మణిపూర్‌లో గత రెండేళ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారని గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు,ముఖ్యంగా యువకులు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి దోచుకున్న, చట్టవిరుద్ధంగా కలిగి ఉన్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్, అవుట్ పోస్ట్, భద్రతా దళాల శిబిరాల్లో సరెండర్ చేయాలని గవర్నర్ కోరారు. ఆయుధాలు తిరిగి ఇచ్చేసే ఒక్క చర్య వల్ల రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడానికి సంకేతంగా మారుతుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు.

ఏడు రోజుల్లోగా ఆయుధాలు అప్పగిస్తే ఎలాంటి శిక్షలు విధించబోము. లేదంటే కఠిన చర్యలు తప్పవని గవర్నర్ హెచ్చరించారు. యువత భవిష్యత్‌ను కాపాడేందుకే ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఉజ్వల భవిష్యత్‌ కోసం అందరం కలిసి రాష్ట్రాన్ని పునర్‌నిర్మించుకుందామని గవర్న్ అజయ్ కుమార్ భల్లా ప్రజలను కోరారు. మణిపూర్‌లో మే 2023లో హింసాకాండ ప్రారంభమైంది. ఇంఫాల్ లోయలోని మెజారిటీ మైతేయి కమ్యూనిటీకి, చుట్టుపక్కల కొండలలోని కుకి-జో గిరిజన సమూహాలకు మధ్య తీవ్రమైన ఘర్షణలు జరిగాయి. దీని ఫలితంగా వేలాది మంది ప్రజలు నిరాశ్రయులవ్వడమే కాకుండా 250 మందికి పైగా మరణించారు.

Next Story