- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆర్టీఐ పరిధిలోకి రాజకీయ పార్టీలు

- ప్రభుత్వ అధికారులుగా గుర్తించాలి
- పిటిషన్ వేసిన ఏడీఆర్
- ఏప్రిల్‌లో విచారించనున్న సుప్రీంకోర్టు
దిశ, నేషనల్ బ్యూరో: రాజకీయ పార్టీలను 'ప్రభుత్వ అధికారులు'గా గుర్తిస్తూ ఆర్టీఐ 2005 పరిధిలోకి చేర్చాలని సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్లు ఏప్రిల్‌లో విచారణకు రానున్నాయి. రాజకీయ పార్టీల వ్యవహారాలన్నింటినీ ఆర్టీఐ చట్టం పరిధిలోకి తీసుకొని రావాలని పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది. అయితే ఎన్జీవో సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) తరపున అడ్వొకేట్ ప్రశాంత్ భూషన్ ఈ పిటిషన్లు పదేళ్లుగా అత్యున్నత న్యాయ స్థానంలో పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. దీంతో ఇలాంటి పిటిషన్లు అన్నింటినీ ఏప్రిల్ 21 తర్వాత విచారిస్తామని సీజేఐతో కూడిన ధర్మాసనం తెలిపింది. కాగా, ఇప్పటికే ఈ కేసులో కాంగ్రెస్, బీజేపీతో పాటు పలు రాజకీయ పార్టీలను ప్రతివాదులుగా చేర్చింది.
ప్రభుత్వం నుంచి భూములు, పన్ను మినహాయింపులు పొందుతున్న రాజకీయ పార్టీలను కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఉత్తర్వు మేరకు ఆర్టీఐ కిందకు తీసుకొని రావాలని ఏడీఆర్ సంస్థ పిటిషన్‌లో కోరింది. ఇలా చేయడం వల్ల రాజకీయ వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని చెప్పింది. కాగా, ఇప్పటికే సీపీఎం పార్టీ ఈ అంశంలో అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో రాజకీయ పార్టీలు పారదర్శకంగా వ్యవహరించాలన్న విషయానికి తాము మద్దతు ఇస్తున్నామని చెప్పింది. అయితే ఒక అభ్యర్థిని ఎందుకు ఎంపిక చేశారనే కారణాలను వెల్లడించడానికి మాత్రం తాము వ్యతిరేకమని సీపీఎం చెప్పింది. పార్టీ అంతర్గతంగా జరిగే చర్చలను ఆర్టీఐ ద్వారా బహిరంగపరచలేమని సీపీఎం స్పష్టం చేసింది. ఐటీ యాక్ట్ ప్రకారం ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పాటించడం సబబే. అయితే ఏయే కారణాల వల్ల, ఏ సమీకరణల వల్ల అభ్యర్థి ఎంపిక జరిగిందో చెప్పడం మాత్రం కుదరని పని అని చెప్పింది. ఆ విషయాన్ని ఆర్టీఐ ద్వారా అడగలేరని సీపీఎం తెలిపింది. ఇది పూర్తిగా పార్టీ అంతర్గత వ్యవహారమని చెప్పింది.
కాగా, సీఐసీ ఇచ్చిన ఒక ఉత్తర్వు ఆధారంగా పొలిటికల్ పార్టీలను ఆర్టీఐ పరిధిలోకి తీసుకొని రావాలని పిటిషన్లు వేయడం కుదరదని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి వివరించింది. కాగా, ఏడీఆర్‌తో పాటు మరి కొంత మంది వేసిన పిటిషన్లలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు పబ్లిక్ అథారిటీలుగా పేర్కొన్నారు. అందువల్ల వీటిని ఆర్టీఐ పరిధిలో చేర్చాల్సిందేనని న్యాయస్థానాన్ని కోరారు. ప్రజా ప్రతినిధుల చట్టం లోని సెక్షన్ 29సీ ప్రకారం రాజకీయ పార్టీలు అందుకునే అన్ని రకాల విరాళాలను ఎలక్షన్ కమిషన్‌కు వెల్లడించాల్సి ఉంది. దీని ప్రకారం రాజకీయ పార్టీల బాధ్యత ఏంటో గుర్తు చేస్తుంది. కాబట్టి ఆయా పార్టీలను పబ్లిక్ అథారిటీలుగా గుర్తించాల్సిందేనని అడ్వొకేట్ అశ్విని ఉపాధ్యాయ్ తన పిటిషన్‌లో కోరాడు. గుర్తింపు పొందిన అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలను నాలుగు వారాల్లోగా ఆర్టీఐ పరిధిలోకి తీసుకొని వచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన పిటిషన్‌లో కోరాడు.