Supreme court: బెయిల్ కేసుల విచారణను వేగవంతం చేయాలి.. హైకోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు

by vinod kumar |
Supreme court: బెయిల్ కేసుల విచారణను వేగవంతం చేయాలి.. హైకోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: సుధీర్ఘ కాలంగా జైలులో ఉన్న వ్యక్తులకు హైకోర్టులు బెయిల్ నిరాకరించడంపై సుప్రీంకోర్టు (Supreme court) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిందితుడు బెయిల్ పొందేందుకు అర్హుడైతే తప్పనిసరిగా బెయిల్ మంజూరు చేయాలని దేశంలోని అన్ని హైకోర్టులను ఆదేశించింది. ఇలాంటి కేసుల్లో విచారణ వేగవంతం చేయాలని తెలిపింది. ఆరు దొంగ నోట్లను అక్రమంగా కలిగి ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగ్రామ్ సదాశివ్ సూర్యవంశీ (sadhashiv Surya vamshi) అనే వ్యక్తి తనకు బాంబే హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, అగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టి పై ఆర్డర్స్ జారీ చేసింది.

‘బెయిల్ పిటిషన్లను తిరస్కరించేటప్పుడు వివిధ హైకోర్టుల ఆదేశాలలో విచారణను పూర్తి చేయడానికి కాలపరిమితిని క్రమం తప్పకుండా నిర్దేశించడం ప్రతిరోజూ గమనిస్తుంటాం. అనేక ట్రయల్ కోర్టుల్లో ఒకే రకానికి చెందిన పాత కేసులు పెండింగ్‌లో ఉండొచ్చు. కాబట్టి ఇటువంటి ఆదేశాలు ట్రయల్ కోర్టుల పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి’ అని వ్యాఖ్యానించింది. ప్రతి కోర్టులో క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, దీర్ఘకాలిక జైలుశిక్ష, నిందితుడి వయస్సు వంటి వివిధ కారణాలతో ఈ సమస్యను త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది.

కాగా, 500 రూపాయల ఆరు నకిలీ నోట్లను కలిగి ఉన్నందుకు గాను సూర్యవంశీ అనే వ్యక్తి రెండున్నరేళ్లుగా జైలులో ఉన్నాడు. అయితే ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు బాంబై హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసులో నిందితులకు ఎలాంటి నేర నేపథ్యం లేదని ధర్మాసనం గుర్తించింది. విచారణ సరైన సమయంలో ముగిసే అవకాశం లేదు. కాబట్టి నిందితుడిని బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది. హైకోర్టులు అనుసరిస్తున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది.

Advertisement

Next Story