supreme court: ఆయుర్వేదం, యునాని ఔషదాలపై ప్రకటనలు.. కేంద్రం నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే

by vinod kumar |
supreme court: ఆయుర్వేదం, యునాని ఔషదాలపై ప్రకటనలు.. కేంద్రం నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే
X

దిశ, నేషనల్ బ్యూరో: డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ రూల్స్ 1945లోని 170వ నిబంధనను తొలగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనికి సంబంధించి ఆయుష్ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ను సైతం రద్దు చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రూల్ 170 అమలులోనే ఉంటుందని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం తెలిపింది. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ రూల్ 170ని తొలగించాలని ప్రభుత్వం ఎలా నిర్ణయించుకుంటుందని కేంద్రాన్ని ప్రశ్నించింది. మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ మే 7 నాటి ఆదేశాలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది. కాగా, రూల్ 170 ఆయుర్వేద, యునాని ఔషధాల తప్పుదోవ పట్టించే ప్రకటనలను నిషేధించడానికి ఉద్దేశించింది. అయితే ఈ నిబంధనను తొలగిస్తూ.. ఆయుష్ మంత్రిత్వ శాఖ జూలై 2న నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ప్రకటనలను తనిఖీ చేయడానికి మాత్రమే రూల్ 170 ఉపయోగపడుతుందని, దీని ప్రకారం.. ప్రకటనలను ముద్రించిన తర్వాత, ప్రసారం చేసిన తర్వాత మాత్రమే వాటిని పరిశీలించొచ్చని సూచించింది. ఈ అంశంపై సమాధానమివ్వాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

Advertisement

Next Story