విపక్ష నేతలు ఐఫోన్లను అప్పగించాలి..హ్యాకింగ్‌పై విచారణ చేస్తాం: కేంద్రం

by Hajipasha |   ( Updated:2024-02-09 11:59:56.0  )
విపక్ష నేతలు ఐఫోన్లను అప్పగించాలి..హ్యాకింగ్‌పై విచారణ చేస్తాం: కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘‘ప్రభుత్వం స్పాన్సర్ చేసిన హ్యాకర్లు ఐఫోన్లపై దాడికి యత్నిస్తున్నారు’’ అంటూ యాపిల్ కంపెనీ నుంచి మెసేజ్‌లు వచ్చాయని గతేడాది అక్టోబరు 30న విపక్ష నేతలు చేసిన ఆరోపణపై ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. అలాంటి మెసేజ్‌లు అందుకున్న విపక్ష నేతలంతా వారివారి ఫోన్లను విచారణ సంస్థలకు అప్పగించి, నిజానిజాలను గుర్తించేందుకుగానూ దర్యాప్తుకు సహకరించాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సూచించారు. శుక్రవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘విపక్ష నేతలు ఆరోపణలు చేసి ఊరుకుంటే ఎలా.. ? వాటి విచారణలో చట్టాన్ని అమలు చేసే సంస్థలకు బాధ్యతగా సహకరించాలి’’ అని కోరారు. తాను కేంద్ర ఐటీశాఖ మంత్రికి లేఖ రాసిన నాలుగు నెలల తర్వాత స్పందించడం దారుణమని శివసేన (ఉద్ధవ్) రాజ్యసభ ఎంపీ ప్రియాంకా చతుర్వేది ఆవేదన వ్యక్తం చేశారు.ఆమె వ్యాఖ్యకు మంత్రి అశ్విని వైష్ణవ్ బదులిస్తూ.. ‘‘ఎవరైనా తమ ఫోన్‌లో సమస్య ఉందని భావిస్తే CERT-Inను సంప్రదించవచ్చు. విపక్ష నేతలంతా దయచేసి ఆ సంస్థకు ఫోన్‌లను అప్పగిస్తే హ్యాకింగ్‌ మెసేజ్‌లపై విచారణ చేస్తారు’’ అని తెలిపారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed