Air Pollution in Delhi: ఢిల్లీలో ప్రమాదకరస్థాయికి పడిపోయిన గాలినాణ్యత.. 500కి చేరుకున్న ఏక్యూఐ

by Shamantha N |
Air Pollution in Delhi: ఢిల్లీలో ప్రమాదకరస్థాయికి పడిపోయిన గాలినాణ్యత.. 500కి చేరుకున్న ఏక్యూఐ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో గత ఏడ్రోజులుగా గాలి నాణ్యత (AQI) ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. మంగళవారం ఉదయం ఆనంద్ విహార్‌తో సహా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 500కి చేరుకుంది. ఢిల్లీలోని విషవాయువు స్థానికుల ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాయుకాలుష్యం(Air Pollution in Delhi) నుంచి తప్పించుకనేందుకు ఢిల్లీవాసులు ఎయిర్ ప్యూరిఫైయర్లు, మాస్క్‌లను ఆశ్రయిస్తున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPBC) తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఢిల్లీలోని ఏక్యూఐ ‘చాలా తీవ్రమైన’ కేటగిరీకి చేరుకుంది. ఏక్యూఐ 484గా నమోదైంది. కాలుష్యాన్ని తగ్గించడానికి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 (GRAP-4) కింద ఆంక్షలను తక్షణమే విధించాలని సుప్రీంకోర్టు సూచించింది. కాలుష్య తీవ్రతదృష్ట్యా 10, 12 తరగతులు మినహా మిగితా వారికి క్లాసులు నిలిపివేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. విషపూరిత గాలి నుండి విద్యార్థులను కాపాడేందుకే ఆన్‌లైన్ తరగతులను నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 10, 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం పాఠశాలలు పనిచేయనున్నాయి.

శశిథరూర్ కీలక వ్యాఖ్యలు

ఢిల్లీలో వాయు కాలుష్యంపై (Air Pollution in Delhi) నానాటికీ పెరిగిపోతోంది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ (Shashi Tharoor) స్పందిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. కాలుష్య నగరాల జాబితా గణాంకాలకు సంబంధించి ఓ టేబుల్‌ను సోషల్ మీడియాలో ఆయన పోస్టు చేశారు. ‘‘ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా (Most Polluted City) ఢిల్లీ మారింది. ఇక్కడ ప్రమాదకర కాలుష్య కారకాలు నాలుగు రెట్లు పెరిగాయి. రెండో అత్యంత కాలుష్య నగరం ఢాకా (బంగ్లాదేశ్‌ రాజధాని)తో పోలిస్తే ఢిల్లీలో ప్రమాద స్థాయి 5 రెట్లు ఎక్కువగానే ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితిని కొన్నేళ్లుగా చూస్తున్నా, కేంద్రం మాత్రం దీని గురించి పట్టించుకోవట్లేదు. నవంబరు నుంచి జనవరి మధ్య ఈ నగరం నివాసయోగ్యంగానే ఉండట్లేదు. మిగతా సమయాల్లోనూ అంతంతమాత్రంగానే జీవనం సాగించగలం. ఇలాంటి పరిణామాల మధ్య ఢిల్లీని ఇంకా దేశ రాజధానిగా కొనసాగించాలా?’’ అని రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed