హేమంత్ సొరేన్‌కు షాక్: బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

by samatah |
హేమంత్ సొరేన్‌కు షాక్: బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్‌కు షాక్ తగిలింది. లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ దాఖలు చేయాలని కోరుతూ హేమంత్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. ట్రయల్‌ కోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి మధ్యంతర బెయిల్‌ ఎలా మంజూరు చేయగలమని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కేసులో చార్జిషీట్‌ను ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకున్నట్లు మా దృష్టికి ఎందుకు తీసుకురాలేదని తెలిపింది. సొరేన్‌కు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో మధ్యంతర బెయిల్‌ కోసం వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు హేమంత్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు. కాగా, జార్ఖండ్‌లో భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సొరేన్‌ను జనవరి 31న ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు.



Next Story