Accident: మధ్యప్రదేశ్‌లో ట్రక్కు-ఆటో రిక్షా ఢీ.. ఏడుగురు మృతి

by Harish |
Accident: మధ్యప్రదేశ్‌లో ట్రక్కు-ఆటో రిక్షా ఢీ.. ఏడుగురు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లో ఘోర యాక్సిడెంట్ జరిగింది. ట్రక్కు-ఆటో రిక్షా ఢీకొనగా, ఈ ఘటనలో ఏడుగురు మరణించగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే, రాష్ట్రంలోని దామోహ్ జిల్లాలో మంగళవారం సాయంత్రం సిహోరా-మజ్‌గవాన్ రహదారిపై వేగంగా వచ్చిన ట్రక్కు-ఆటో రిక్షాను ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు.. మొత్తం 7 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. చనిపోయిన వారిని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. గాయపడిన వారిని చికిత్స కోసం దగ్గరలోని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. మరింత మెరుగైన చికిత్స కోసం వారిని జబల్పూర్ మెడికల్ కాలేజ్‌కి తరలించారు.

దామోహ్ పోలీసు సూపరింటెండెంట్(SP) కీర్తి సోమవంశీ మాట్లాడుతూ, ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నాం. గాయపడిన వారికి చికిత్స అందుతుంది. వారు స్పృహలోకి వచ్చిన తర్వాత స్టేట్‌మెంట్‌లు రికార్డ్ చేసి, ప్రమాద వివరాలను క్షుణ్ణంగా తెలుసుకుంటాం. ట్రక్ డ్రైవర్ మా కస్టడీలో ఉన్నాడు. మద్యం సేవించి వాహనం నడిపాడా లేదా అని పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు.

ఘటన సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు ఈ నష్టాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్‌లో తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ఆర్థిక సాయం కింద రూ.50,000 మంజూరు చేశారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

Next Story

Most Viewed