790 పాయింట్లు పతనమైన సెన్సెక్స్

by S Gopi |   ( Updated:2024-04-12 11:55:44.0  )
790 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. గత కొన్ని సెషన్లుగా రికార్డు గరిష్ఠాల్లో ర్యాలీ చేస్తున్న సూచీలు శుక్రవారం పతనమయ్యాయి. ప్రధానంగా అమెరికాలో ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే ఎక్కువ నమోదవడంతో ఫెడ్ ఇటీవల ఇచ్చిన వడ్డీ తగ్గింపు ప్రకటన అవకాశాలపై సందేహాలు ఏర్పడ్డాయి. ఈ ఏడాది మూడు సార్లు వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే ఆశలను అధిక ద్రవ్యోల్బణ దెబ్బకొట్టింది. అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, ఆసియా మార్కెట్ల బలహీన ర్యాలీతో మదుపర్లు గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణకు దిగారు. దీనికితోడు ముడి చమురు ధరలు పెరగడం కూడా ఇన్వెస్టర్లలో కొంత ఒత్తిడిని పెంచింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 793.25 పాయింట్లు కుదేలై 74,244 వద్ద, నిఫ్టీ 234.40 పాయింట్లు క్షీణించి 22,519 వద్ద ముగిశాయి. నిఫ్టీలో అన్ని రంగాలు పతనమయ్యాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా మోటార్స్, టీసీఎస్, నెస్లె ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు మాత్రమే లాభాలను దక్కించుకున్నాయి. మిగిలిన అన్నీ బలహీనపడ్డాయి. ముఖ్యంగా సన్‌ఫార్మా, మారుతీ సుజుకి, పవర్‌గ్రిడ్, టైటాన్, ఎల్అండ్‌టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 2-4 శాతం మధ్య నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.47 వద్ద ఉంది.

Advertisement

Next Story