తిరిగి రికార్డు గరిష్ఠాలకు స్టాక్ మార్కెట్లు

by S Gopi |   ( Updated:2024-06-07 16:38:11.0  )
తిరిగి రికార్డు గరిష్ఠాలకు స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈక్విటీ మార్కెట్లు మరోసారి రికార్డు గరిష్ఠాలను తాకాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాల రోజు కుప్పకూలిన తర్వాత సూచీలు చాలా వేగంగా పుంజుకున్నాయి. ప్రధాని మోడీ మూడోసారి ప్రభుత్వాన్ని కొనసాగించడానికి తోడు శుక్రవారం ముగిసిన ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు వరుసగా ఎనిమిదోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం వంటి అంశాలు స్టాక్ మార్కెట్ల ర్యాలీ కారణమయ్యాయి. వీటికితోడు కీలక రిలయన్స్, ఇన్ఫోసిస్, ఎయిర్‌టెల్ లాంటి దిగ్గజ కంపెనీల షేర్లలో మదుపర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లను చేపట్టడంతో సెన్సెక్స్ 76,795 వద్ద ఆల్‌టైమ్ రికార్డు స్థాయిని తాకింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,618.85 పాయింట్లు ఎగసి 76,693 వద్ద, నిఫ్టీ 468.75 పాయింట్లు లాభపడి 23,290 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, ఆటో, మెటల్, రియల్టీ రంగాలు 2 శాతానికి పైగా రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, ఆల్ట్రా సిమెంట్ సహా పలు కీలక కంపెనీల షేర్లు 3 శాతానికి పైగా లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.42 వద్ద ఉంది. సార్వత్రిక ఫలితాలతో పతనమైన తర్వాత తిరిగి రికార్డు స్థాయిలకు చేరిన సూచీల ర్యాలీతో మదుపర్ల సంపద గత మూడు రోజుల్లో రూ. 28 లక్షల కోట్లు పెరిగాయి. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 423.2 లక్షల కోట్లకు చేరింది.

Advertisement

Next Story

Most Viewed