- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నేడు అమృత్‌సర్‌కు రెండో విడత అక్రమ వలసదారులు

- 119 మందిని తీసుకొని రానున్న అమెరికా విమానం
- రాత్రికి ఇండియా చేరుకునే అవకాశం
- ఆదివారం రానున్న మూడో విమానం
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో డీపోర్టేషన్‌కు గురైన భారతీయులను తీసుకొని మరో విమానం అమృత్‌సర్‌కు రానుంది. 119 మంది భారతీయ అక్రమ వలసదారులతో కూడిన ఈ విమానం శనివారం రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య అమృత్‌సర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగనున్నట్లు అధికారులు తెలిపారు. 119 మందితో కూడిన ఈ విమానంలో 67 మంది పంజాబీయులు, 33 మంది హర్యానాకు చెందిన వారు ఉన్నారు. గుజరాత్‌కు చెందిన వారు 8 మంది, ఉత్తరప్రదేశ్ నుంచి 3, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు. ఇక హిమాచల్‌ప్రదేశ్, జమ్ము కశ్మీర్‌కు చెందిన ఒక్కో వలసదారు కూడా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అమెరికా అధికారులు సమాచారం ఇవ్వడంతో ఇప్పటికే అమృత్‌సర్ ఎయిర్‌పోర్టులో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు, పోలీసులు, విదేశాంగ శాఖ ప్రతినిధులు ఎయిర్ పోర్టులో వారిని రిసీవ్ చేసుకోనున్నారు.
ఫిబ్రవరి 5న వచ్చిన తొలి విమానంలో అక్రమ వలసదారుల కాళ్లకు సంకెళ్లు వేసి పంపడంపై పార్లమెంటులో ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఇదొక హేయమైన చర్యని, మానవత్వాన్ని కూడా మరిచి వారికి సంకెళ్లు వేయడం ఏంటని అధికార ఎన్డీయేను ప్రశ్నించాయి. అప్పుడే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ రాజ్యసభలో వివరణ ఇచ్చారు. అమెరికా అధికారులతో మాట్లాడుతున్నామని.. ఇలా సంకెళ్లు వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశామని జై శంకర్ చెప్పారు. కాగా, కేంద్ర ప్రభుత్వం తమ అభ్యంతరం తెలపడంతో రెండో విడత వలసదారులను విమానంలో సంకెళ్లతో బంధించడం లేదని తెలిసింది. ఇక మూడో విడత వలసదారులతో కూడిన విమానం ఫిబ్రవరి 16(ఆదివారం) ఇండియాకు రానున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా, అక్రమ పద్దతుల్లో అమెరికాలో ప్రవేశించిన అనేక మందిని ఆ దేశం డీపోర్ట్ చేస్తోంది. ఇలా వెళ్లిన వారిలో లక్షల రూపాయలను ఏజెంట్లకు ఇచ్చి మోసపోయిన వారే ఎక్కువ. మొదటి విమానంలో అక్రమ వలసదారులు వెనక్కు వచ్చిన దగ్గర నుంచి పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు అనేక మంది ఏజెంట్లను అరెస్టు చేశాయి. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ కూడా అక్రమ వలసదారుల అంశాన్ని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో చర్చించినట్లు తెలిసింది.