శాస్త్రవేత్తల అద్భుత సృష్టి.. ఇకపై వాటికోసం జంతువులు అవసరం లేదు!

by D.Reddy |   ( Updated:2025-04-08 14:30:52.0  )
శాస్త్రవేత్తల అద్భుత సృష్టి.. ఇకపై వాటికోసం జంతువులు అవసరం లేదు!
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా ఔషధాలు, ఆహార పదార్థాలు, సౌందర్య సాధనాలకు సంబంధించిన ప్రయోగాలను శాస్త్రవేత్తలు (Scientists) ముందుగా జంతువులపై (Animals) ప్రయోగిస్తారని తెలిసిందే. సమస్యలూ లేవని నిర్ధారించుకున్న తర్వాత మనుషులకు కొంత టెస్ట్ డోస్ ఇచ్చి దాని ప్రభావాన్ని గమనిస్తారు. అయితే, ఈ పద్ధతిలో జంతువులకు హాని కలుగుతుంది. ఈ నేపథ్యంలో సౌందర్య సాధనాల పరీక్షల కోసం ఇకపై జంతువుల అవసరం లేకుండా, శాస్త్రవేత్తలు 3డీ ప్రింటింగ్ సాంకేతికతతో మానవ చర్మాన్ని (Human skin) తయారు చేశారు. ఆస్ట్రియాలోని టీయూ గ్రాజ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (Austria’s TU Graz University of Technology) భారత్‌లోని వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (India’s Vellore Institute of Technology) పరిశోధకులు కలిసి ఈ అద్భుతాన్ని సాధించారు. ఈ కృత్రిమ చర్మం మన చర్మంలో ఉండే ఎపిడెర్మిస్, డెర్మిస్, హైపోడెర్మిస్ అనే మూడు పొరలను ఖచ్చితంగా అనుకరిస్తుంది.

సన్‌స్క్రీన్‌లు, సీరమ్‌లు వంటి సౌందర్య ఉత్పత్తులు చర్మంలో ఎలా పనిచేస్తాయి, వాటిలోని నానో కణాలు ఎంతవరకు సురక్షితమో తెలుసుకోవడానికి ఈ చర్మం ఉపయోగపడనుంది. దీన్ని తయారు చేయడానికి హైడ్రోజెల్ (Hydrogels) అనే పదార్థాన్ని వాడారు. ఇందులో జీవ కణాలు 2-3 వారాల పాటు సజీవంగా ఉంటాయి. ఈ సాంకేతికతతో జంతు ప్రయోగాలను పూర్తిగా తగ్గించి, మరింత ఖచ్చితమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది.

ఈ పరిశోధన యూరోపియన్ యూనియన్‌లో జంతు ప్రయోగాలపై ఉన్న నిషేధానికి అనుగుణంగా ఉంది. ఇప్పటికే మొదటి దశ పరీక్షల్లో విజయం సాధించిన ఈ ఆవిష్కరణ, సౌందర్య ఉత్పత్తుల భద్రతను మెరుగుపరచడంతో పాటు ఔషధాల పరీక్షలు, గాయాల చికిత్సలలో కూడా ఉపయోగపడే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలోనే సౌందర్య సాధనాల్లోని నానో కణాల ప్రభావాన్ని పరీక్షించేందుకు ఈ చర్మం సిద్ధంగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.



Next Story

Most Viewed