‘నీట్’ పరీక్షను రద్దు చేసేది లేదన్న సుప్రీంకోర్టు

by S Gopi |
‘నీట్’ పరీక్షను రద్దు చేసేది లేదన్న సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్-యూజీ-2024 పరీక్షలో పేపర్ లీక్, అవకతవకలకు సంబంధించి మూడు హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. ఈ సందర్భంగా నీట్ పరీక్షల వ్యవహారంపై అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. బీహార్ రాష్ట్రంలో ఈ పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ అయినట్టు కథనాలు వెలువడ్డాయి. అయితే, కేంద్రంతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) వాటిని తిరిస్కరించాయి. కానీ పేపర్ లీక్ అయిన విషయం నిజమేనని స్పష్టమైంది. పరీక్షకు ఒకరోజు ముందే ప్రశ్నాపత్రం అందినట్టు బీహార్‌లో అరెస్ట్ అయిన కొంతమంది విద్యార్థులు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. నీట్ పేపర్ల లీకేజీ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు బీహార్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఆ దర్యాప్తులో పోలీసులు ఇప్పటివరకు 14 మందిని అరెస్ట్ చేయగా, వారిలో బీహార్ ప్రభుత్వ విభాగంలోనే విధులు నిర్వహిస్తున్న ఓ జూనియర్ ఇంజనీర్, ముగ్గురు నీట్ అభ్యర్థులు ఉన్నారు. ముగ్గురు అభ్యర్థుల్లో ఒకరు జూనియర్ ఇంజనీర్‌కు బంధువు అవుతారు. సమస్తిపూర్‌కు చెందిన అభ్యర్థి మేలో జరిగిన పరీక్షకు ఒకరోజు ముందు లీక్ అయిన ప్రశ్నపత్రాన్ని తన మామ తనకు అందజేసినట్లు అతను అంగీకరించాడని పోలీసులు తెలిపారు. 'పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్న సమయంలో మా మామయ్య ఫోన్ చేశారు. ఇంటికి రమ్మని పిలిచారు. నీట్ పరీక్షకు ఒకరోజు ముందు మే 4న స్నేహితులతో కలిసి వెళ్లాను. తనకు నీట్ ప్రశ్నాపత్రం, ఆన్సర్ షీట్ ఇచ్చారు. రాత్రంతా వాటిని మేము బట్టీపట్టాం. పరీక్షలో కూడా అవే వచ్చాయని ' అభ్యర్థి అనురాగ్ యాదవ్ లిఖితపూర్వకంగా పోలీసులకు అందజేశాడు. ఈ పరిణామంతో నీట్ అవకతవకల వ్యవహారం తీవ్రత పెరిగింది. కాగా, ఎన్‌టీఏ, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై జూలై 8న విచారణ జరగనుంది.

కేంద్రం, ఎన్‌టీఏకు ఉత్తర్వులు..

ఇక, నీట్ పరీక్ష అక్రమాల గురించి దాఖలైన పిటిషన్‌లపై గురువారం సుప్రీంకోర్టు స్టే విధించింది. అన్ని పిటిషన్‌లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఎన్‌టీఏ కోరిన నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. పరీక్ష రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌కు సమాధానం చెప్పాలని న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన వెకేషన్ బెంచ్ కేంద్రంతో పాటు ఎన్‌టీఏకు నోటీసులిచ్చింది. ఇదే సమయంలో నీట్ కౌన్సిలింగ్ ప్రక్రియను మాత్రం ఆపేది లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

నీట్ యూజీ రీ-ఎగ్జామ్ అడ్మిట్ కార్డుల విడుదల..

మరోవైపు, ఇటీవల 1,563 మంది అభ్యర్థుల గ్రేస్ మార్కులను రద్దు చేసిన కేంద్రం, వారికి తిరిగి పరీక్ష నిర్వహించేందుకు నీట్ యూజీ రీ-ఎగ్జామ్-2024 అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డు ప్రింటెడ్ కాపీ, ఒక ఐడీ ప్రూఫ్‌ను పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లాలని ఎన్‌టీఏ వెల్లడించింది. ఈ రీ-ఎగ్జామ్ జూన్ 23న జరుగుతుందని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed