Himachal: ప్రజల ప్రాణాలను రక్షించడమే ప్రాధాన్యం: హిమాచల్ ముఖ్యమంత్రి

by S Gopi |
Himachal: ప్రజల ప్రాణాలను రక్షించడమే ప్రాధాన్యం: హిమాచల్ ముఖ్యమంత్రి
X

దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో భారత సైన్యం, రాష్ట్ర ప్రభుత్వం, అగ్నిమాపక సేవలు, ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ సహాయక చర్యలకు సంబంధించి సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో సహాయక చర్యల నిమిత్తం వివిధ విభాగాలకు చెందిన ఎనిమిది బృందాలు సమన్వయంతో పనిచేయనున్నాయి. ఇప్పటికే బాధిత ప్రజల ఇబ్బందులను నివారించేందుకు బెయిలీ వంతెనలు నిర్మించారు. ముఖ్యంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున కులులో బియాస్ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా తలెత్తిన పరిస్థితిని సమీక్షించడానికి హిమాచల్ సీఎం ఠాకూర్ సుఖ్విందర్ సింగ్ సుఖు రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి అందిన నివేదికల ప్రకారం, భారీ వర్షాలకు మరణించిన రెండు మృతదేహాలను వెలికి తీశామని, ఇంకా 50 మందికి పైగా గల్లంతయ్యారని సీఎం తెలిపారు. ప్రజల ప్రాణాలను రక్షించడం తమకు అత్యంత ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. గత 12 గంటల్లో భారీ వర్షాల కారణంగా ఐదు రోడ్లు, ఒక జాతీయ రహదారి కూడా మూసుకుపోయిందని, మూడు వంతెనలు దెబ్బతిన్నాయని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. బాధిత కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని, బాధిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బెయిలీ వంతెనలు నిర్మించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. విపత్తుల పర్యవేక్షణ కోసం రాష్ట్రంలోని 13 చోట్ల స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామని, ఇవి 24 గంటలూ పనిచేస్తాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని నాలుగైదు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.

జలవిద్యుత్ ప్రాజెక్టుపై అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం..

బ్రిటీష్ కాలం నాటి హైడల్ పవర్ ప్లాంట్ - పంజాబ్‌తో షానన్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ 99 ఏళ్ల లీజుకు సంబంధించిన వివాదం మధ్య గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఠాకూర్ సుఖ్విందర్ సింగ్ సుఖు అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారుల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. జోగిందర్‌నగర్‌లో ఉన్న షానన్ పవర్ హౌస్, 1925లో జరిగిన అప్పటి లీజు అమలు చేసినప్పటి నుంచి వివాదాస్పదంగా మారింది. షానన్ పవర్ హౌస్ యాజమాన్యాన్ని పంజాబ్ వదులుకున్నప్పటికీ, అది హిమాచల్ ప్రదేశ్‌ నియంత్రణకు ఇవ్వలేదు. ఈ ప్రాజెక్ట్‌పై హిమాచల్ ప్రదేశ్‌కు ఉన్న అన్ని హక్కులను పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేసిన ఠాకూర్, సుప్రీం కోర్టులో కేసును బలంగా, సమర్థవంతంగా వాదించాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed