Russia Ukraine: కీవ్ నగరంపై మరోసారి రష్యా దాడి.. నాలుగు రోజుల్లోనే మూడోసారి అటాక్

by vinod kumar |
Russia Ukraine: కీవ్ నగరంపై మరోసారి రష్యా దాడి.. నాలుగు రోజుల్లోనే మూడోసారి అటాక్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. రాజధాని కీవ్ నగరంపై గురువారం క్షిపణులు, డ్రోన్లతో భారీ దాడికి పాల్పడింది. రష్యా దళాలు తమ లక్ష్యాలపై ఐదు క్షిపణులు, 74 డ్రోన్లు ప్రయోగించినట్టు ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. అయితే వాటన్నింటినీ తిప్పికొట్టినట్టు పేర్కొంది. రెండు క్షిపణులు, 60 డ్రోన్‌లను అడ్డుకున్నామని, 14 ఇతర డ్రోన్‌లు లక్ష్యాన్ని చేరుకోకముందే పడిపోయాయని వెల్లడించింది. నగరంలోని మూడు జిల్లాల్లో ధ్వంసమైన డ్రోన్‌ల శిధిలాలు పడిపోయాయని, పౌర మౌలిక సదుపాయాలకు స్వల్ప నష్టం వాటిల్లిందని కీవ్ ఉన్నతాధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు.

కాగా, నాలుగు రోజుల్లోనే రష్యా కీవ్ నగరంపై మూడు సార్లు దాడులకు పాల్పడటం గమనార్హం. రష్యా అరాచకాన్ని అడ్డుకోవడంలో తమ భాగస్వాములందరూ మరింత చురుకుగా ఉండాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఇటీవల పిలుపునిచ్చారు. యుద్ధాన్ని త్వరగా ముగించడానికి తమకు సహాయపడాలని కోరారు. ఈ నేపథ్యంలోనే రష్యా దాడులను ఉధృతం చేసింది. అంతకుముందు 100 డ్రోన్లు, 100 క్షిపణులతో కీవ్ పై దాడిచేసింది. ఇంధన వనరులే లక్ష్యంగా అటాక్ చేసింది. దీంతో కీవ్ నగరంలో పలు చోట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.

రష్యాలోని చమురు నిల్వ కేంద్రాలపై ఉక్రెయిన్ దాడి !

మరోవైపు రష్యాలోని చమురు నిల్వ కేంద్రాలపై దాడి చేసినట్టు ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. దక్షిణ రోస్టోవ్ ప్రాంతంలోని అట్లాస్ ఆయిల్ డిపో, కిరోవ్ ప్రాంతంలోని జెనిట్ చమురు కేంద్రంపై కూడా దాడి చేసినట్లు వెల్లడించింది. రష్యా యుద్ధ ప్రయత్నాలకు కీలకమైన శక్తి, రవాణా, సైనిక మౌలిక సదుపాయాలను నాశనం చేయడమే లక్ష్యంగా చేసుకున్నామని చెప్పారు. దీనిపై వొరోనెజ్‌ గవర్నర్ అలెగ్జాండర్ గుసేవ్ స్పందిస్తూ.. ఉక్రేనియన్ డ్రోన్‌ల నుంచి శిథిలాలు మాత్రమే సమీప ప్రాంతంలో పడ్డాయని అవి పేలలేదని తెలిపారు.

Advertisement

Next Story