RG Kar : ఆ మూడు గంటలు జూనియర్ వైద్యురాలు బతికే ఉందా ? : డాక్టర్ తపస్

by Hajipasha |
RG Kar : ఆ మూడు గంటలు జూనియర్ వైద్యురాలు బతికే ఉందా ?  : డాక్టర్ తపస్
X

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన కేసులో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను సుదీర్ఘంగా విచారించిన సీబీఐ.. ఆయనను ఎట్టకేలకు అరెస్టు చేసింది. కాలేజీకి అనుబంధంగా పనిచేసే ఆస్పత్రిలో ఆర్థికపరమైన అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలతో ఆయనను అరెస్టు చేశామని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. కోల్‌కతా సీబీఐ ఆఫీసులో వరుసగా 15వ రోజు (సోమవారం) కూడా ఉదయమంతా సందీప్ ఘోష్‌ను అధికారులు ప్రశ్నించారు. ఆయనను అరెస్టు చేశామని సాయంత్రం ప్రకటించారు. సందీప్ ఘోష్ సహా పలువురు ప్రిన్సిపల్స్‌గా వ్యవహరించిన సమయంలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జరిగిన ఆర్థిక మోసాలను లోతుగా దర్యాప్తు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్స్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది. ఇటీవలే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సైతం సందీప్ ఘోష్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ కీలక ప్రకటన చేసింది.

బెంగాల్ సర్కారు వాదనను తోసిపుచ్చి..

పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కారుకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. కోల్‌కతా మెడికల్ కాలేజీలో జరిగిన దురాగతాన్ని నిరసిస్తూ పశ్చిమ్‌ బంగా ఛాత్ర సమాజ్‌ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు ఆగస్టు 27న బెంగాల్ సచివాలయాన్ని (నబన్న) ముట్టడించారు. సయన్ లాహిరి అనే వ్యక్తి ‘నబన్న అభిజన్’ పేరుతో ఆ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ నిరసనలు జరుగుతుండగా పోలీసులు సయన్ లాహిరిని అరెస్టు చేశారు. అయితే దీనిపై సయన్ లాహిరి తల్లి కలకత్తా హైకోర్టును ఆశ్రయించడంతో విడుదలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ ఆర్డర్స్‌ను సవాల్ చేస్తూ బెంగాల్‌లోని టీఎంసీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దాన్ని సోమవారం విచారించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం బెంగాల్ సర్కారు వాదనను తోసిపుచ్చింది. అప్పీల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఆ మూడు గంటలు జూనియర్ వైద్యురాలు బతికే ఉందా ? : డాక్టర్ తపస్

ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ సెమినార్ హాలులో జూనియర్ వైద్యురాలి డెడ్‌బాడీని తొలిసారిగా ఆగస్టు 9న ఉదయం 9.30 గంటలకు గుర్తించారు.అయితే ఆమె చనిపోయిందని పేర్కొంటూ ఆ రోజు మధ్యాహ్నం 12.44 గంటలకు ఆర్జీ కర్ ఆస్పత్రి ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్ ప్రకటన చేశారు. అయితే జూనియర్ వైద్యురాలు చనిపోయిందని ప్రకటించడానికి మూడుగంటల టైమ్ ఎందుకు తీసుకున్నారని డాక్టర్ తపస్ ప్రమాణిక్ ప్రశ్నిస్తున్నారు. ఆయన ఆగస్టు 8వ తేదీన రాత్రి 8 గంటల నుంచి ఆగస్టు 9న ఉదయం 9 గంటల వరకు ఆ ఆస్పత్రిలోనే డ్యూటీ చేశారు. అనంతరం ఇంటికి వెళ్లిపోయారు. ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలు విగతజీవిగా కనిపించిందనే విషయం ఆగస్టు 9న ఉదయం 11.45 గంటలకు ఆయనకు సోషల్ మీడియా గ్రూప్ ద్వారా తెలియడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. ‘‘ఆగస్టు 9న ఉదయం 9.30 నుంచి 12.44 వరకు ఆస్పత్రిలో ఏం జరిగింది ? ఆ మూడు గంటల వ్యవధిలో జూనియర్ వైద్యురాలు బతికే ఉందా ? అందుకే 12.44 గంటలకు చనిపోయినట్టు ప్రకటించారా ? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాల్సిన అవసరం ఉంది’’ అని డాక్టర్ తపస్ ప్రమాణిక్ అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed