గురుపత్వంత్ సింగ్ హత్యాయత్నం వెనుక ‘రా’!: వాషింగ్టన్ పోస్ట్ కథనం..తీవ్రంగా ఖండించిన భారత్

by samatah |
గురుపత్వంత్ సింగ్ హత్యాయత్నం వెనుక ‘రా’!: వాషింగ్టన్ పోస్ట్ కథనం..తీవ్రంగా ఖండించిన భారత్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఖలిస్థాన్ వేర్పాటు వాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ పై అమెరికాలో జరిగిన హత్యాయత్నం కుట్రలో భారత గూఢచార సంస్థ ‘రా’ అధికారి విక్రమ్ యాదవ్ ప్రమేయం ఉందని వాషింగ్టన్ పోస్ట్ సోమవారం సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ చర్యకు అప్పటి రా చీఫ్ సమంత్ గోయెల్ సైతం అనుమతించారని వెల్లడించింది. కాబట్టి దీని వెనుక వారి ప్రమేయం ఉంటుందని యూఎస్ భావిస్తున్నట్టు తెలిపింది. అయితే ఈ ప్రయత్నాన్ని అమెరికా నిఘా సంస్థలు అడ్డుకున్నాయని తెలిపింది. అంతేగాక ఈ విషయం భారత ప్రధాని మోడీ సన్నిహితులకు కూడా తెలుసని దానికి సంబంధించిన పలు ఆధారాలను కూడా యూఎస్ నిఘా సంస్థలు కొంత మేర సేకరించినట్టు పేర్కొంది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు కూడా ఈ విషషయం గురించి తెలుసని అమెరికా గూఢచార సంస్థలు అంచనా వేసినప్పటికీ దానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి రుజువు లభించలేదని వాషింగ్టన్ పోస్ట్ తెలిసింది.

ఈ కథనంపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు మంగళవారం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. వాషింగ్టన్ పోస్టు ప్రచురించిన కథనాన్ని నిరాధారమైనదిగా అభివర్ణించారు. టెర్రరిస్టు నెట్ వర్క్‌లకు సంబంధించి అమెరికా లేవనెత్తిన భద్రతా పరమైన సమస్యలను పరిశీలించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ విచారిస్తోందని తెలిపారు. ఊహాజనిత, బాధ్యతారహిత మైన కథనాల వల్ల ఉపయోగం ఉండబోదని తెలిపారు. కాగా, పన్నూన్ అమెరికాలో సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్‌గా ఉన్నారు. భారత ప్రభుత్వం గతంలో ఆయనను ఉగ్రవాదిగా ప్రకటించింది.

మరోవైపు గురుపత్వంత్ పన్నూన్ హత్యకు సంబంధించిన ఆరోపణలను భారత్ సీరియస్ గా తీసుకుంటోందని వైట్ హౌస్ తెలిపింది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపడతామని తమకు హామీ ఇచ్చినట్టు పేర్కొంది. వాషింగ్టన్ పోస్ట్ నివేదికపై వైట్ హౌస్ సెక్రటరీ కరీజ్ జిన్ పియర్ సమాధానమిస్తూ..ఈ అంశంపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. యూఎస్-భారత్‌లు ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వాములు అని కొనియాడారు. అనేక రంగాల్లో సహకారాన్ని విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed