అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రతిష్టాపనకు ముహూర్తం ఖరారు..

by Vinod kumar |
అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రతిష్టాపనకు ముహూర్తం ఖరారు..
X

అయోధ్య: అయోధ్యలోని రామమందిరంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వచ్చే ఏడాది జనవరి 21, 22, 23 తేదీల్లో నిర్వహిస్తామని ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ప్రముఖ సాధువులు, ఇతర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ‘ప్రధాన కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తాం. వివిధ రాజకీయ పార్టీల నాయకులను కూడా ఆహ్వానిస్తాం. ఇందులో పాల్గొనడంపై నిర్ణయం వాళ్లకే వదిలేశాం. ఈ సందర్భంగా బహిరంగ సభ ఉండదు’ అని చంపత్ రాయ్ స్పష్టం చేశారు.

136 సనాతన సంప్రదాయాలకు చెందిన 25 వేల మంది హిందూ మత పెద్దలను కూడా ఆహ్వానించాలని ట్రస్ట్ ఆలోచిస్తోంది. అలాంటి సాధువుల జాబితాను ఆలయ ట్రస్ట్ సిద్ధం చేస్తోందని, ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ సంతకంతో త్వరలో ఆహ్వాన పత్రం పంపిస్తామన్నారు. ప్రముఖ సాధువులందరికీ అయోధ్యలోని పెద్ద మఠాల్లో వసతి కల్పిస్తామని చెప్పారు. కొవిడ్ ఆంక్షల వల్ల ఆలయానికి భూమి పూజ కార్యక్రమం 2020 ఆగస్టు 5వ తేదీన చాలా పరిమిత స్థాయిలో జరిగింది. రాంలాలా గర్భగుడి ముగింపు దశకు చేరుకుందని, జనవరి నెలలో ‘ప్రాణ్ ప్రతిష్ఠ’ భారీ కార్యక్రమం కోసం సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయని ఆలయ ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు. పవిత్రాభిషేక మహోత్సవానికి వచ్చే భక్తులకు నెల రోజుల పాటు ఉచిత భోజనం అందించాలని ట్రస్టు ప్లాన్ చేస్తోంది. జనవరి నెలలో రోజూ 70,000-1,00,000 మందికి భోజనం అందిస్తారు.

Advertisement

Next Story

Most Viewed