Railways Bill: రైల్వే సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం.. ప్రయివేటీకరణ జరగబోదన్న ప్రభుత్వం

by vinod kumar |
Railways Bill: రైల్వే సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం.. ప్రయివేటీకరణ జరగబోదన్న ప్రభుత్వం
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా రైల్వే సవరణ బిల్లు-2024కు లోక్ సభ (Loke sabha) బుధవారం ఆమోదం తెలిపింది. దీనిపై చర్చ అనంతరం మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించారు. ఈ సవరణ ప్రాథమికంగా రైల్వే బోర్డుకు చట్టబద్ధమైన అధికారాలను మంజూరు చేస్తుంది. బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashvini vaishnaw) మాట్లాడుతూ.. సవరణ బిల్లు రైల్వేల ప్రయివేటీకరణకు దారితీయబోదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. రాజ్యాంగంపై ప్రతిపక్షాలు చేస్తున్న బూటకపు కథ ఇప్పటికే బట్టబయలైందని, రైల్వేలపై చేస్తున్న అబద్ధం కూడా విఫలమవుతుందని విమర్శించారు. రైల్వేస్ (సవరణ) బిల్లు 2024 రైల్వే బోర్డు పనితీరు, స్వతంత్రతను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.

రైల్వే చట్టం 1989, ఇండియన్ రైల్వే బోర్డు చట్టం ఏకీకరణ దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని నొక్కి చెప్పారు. 10 వేల ఇంజన్లు, 15 వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌లపై పకడ్బందీ పనులు ప్రారంభించామన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు 20 ఏళ్లలో చేసిన పనిని భారత్ ఐదేళ్లలో చేసిందని కొనియాడారు. నేడు దేశంలో రక్షణ, రైల్వేలు రెండు రంగాలుగా ఉన్నాయని, వీటిని రాజకీయం చేయకుండా ముందుకు సాగాలన్నారు. కాగా, భారతీయ రైల్వే బోర్డు చట్టం 1905ని రైల్వే చట్టం 1989లో అనుసంధానం చేసేందుకు రైల్వే అమెండ్‌మెంట్ బిల్ 2024ని తీసుకొచ్చారు. దీనిని గత పార్లమెంట్ సమావేశాల్లోనే లోక్ సభలో ప్రవేశపెట్టగా తాజాగా ఆమోదించారు.

ప్రతిపక్షాల ఆందోళన

బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష ఎంపీలు ప్రయివేటీకరణకు గల అవకాశాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రైల్వే సౌకర్యాన్ని ఈ బిల్లు తగ్గించే ప్రమాదం ఉందని కాంగ్రెస్ ఎంపీ మనోజ్ కుమార్ హెచ్చరించారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ నీరజ్ మౌర్య మాట్లాడుతూ బిల్లును ప్రవేశపెట్టే ముందు అఖిలపక్షంతో సంప్రదింపులు జరిపితే మరింత సముచితంగా ఉండేదని తెలిపారు. అయితే అశ్వినీ వైష్ణవ్ వీటన్నింటినీ కొట్టిపారేశారు.

Advertisement

Next Story

Most Viewed