Rahul: రాహుల్, ప్రియాంకా గాంధీలు రాజీనామా చేయాలి.. ఈవీఎం ఆరోపణలపై బీజేపీ కౌంటర్

by vinod kumar |
Rahul: రాహుల్, ప్రియాంకా గాంధీలు రాజీనామా చేయాలి.. ఈవీఎం ఆరోపణలపై బీజేపీ కౌంటర్
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర ఎన్నికల అనంతరం ఈవీఎంల విశ్వసనీయతపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. రాహుల్ (Rahul), ప్రియాంకా గాంధీ(Priyanka gandhi), కాంగ్రెస్ తరఫున ఎన్నికైన ఇతర ప్రజాప్రతినిధులు ముందుగా రాజీనామా చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా (Gaurav Bhatia) డిమాండ్ చేశారు. బ్యాలట్ పేపర్లు వచ్చిన తర్వాతే వీరంతా ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించాలన్నారు. ఇలా చేస్తే వారిలో ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుందని, లేదంటే కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు కేవలం ఉత్త మాటలుగానే మిలిపోతాయన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈవీఎంల వ్యవహారంపై కాంగ్రెస్ కోర్టును ఆశ్రయించాలని సూచించారు. ఎన్నికల పారదర్శకత, ఈవీఎంల విశ్వసనీయతసై సుప్రీంకోర్టు (Supreme court) చాలాసార్లు క్లీన్ చీట్ ఇచ్చిందని గుర్తు చేశారు.

రాహుల్, ప్రియాంకలు ఇదే ప్రక్రియ ద్వారా ఎంపీలుగా ఎన్నికయ్యారని, కాబట్టి వారు వెంటనే రిజైన్ చేయాలని చెప్పారు. కేరళలోని వయనాడ్ (Wayanad) నుంచి లోక్‌సభ ఎంపీగా గెలిచిన ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే కాంగ్రెస్ చీఫ్ ఖర్గే(Karge) ఈవీఎంలపై ప్రశ్నలు లేవనెత్తడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ త్వరలో చరిత్ర పుటలకే పరిమితం కానుందని స్పష్టం చేశారు. కాగా, ఇటీవల జరిగిన మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం కాంగ్రెస్ ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఈసీకి పలు అభ్యర్థనలతో కూడిన లేఖను సైతం రాసింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ కౌంటర్ ఇచ్చింది.

Advertisement

Next Story