Rahul gandhi: మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలి.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ

by vinod kumar |
Rahul gandhi: మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలి.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు మేథోమథనం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బిహార్ తర్వాత మహారాష్ట్రలో చిన్నారులపై జరిగిన అవమానకరమైన నేరాలు సమాజం, మనం ఎటువైపు వెళ్తున్నామో ఆలోచించేలా చేస్తున్నాయి? బద్లాపూర్‌లో ఘటన అనంతరం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు వీధుల్లోకి వచ్చే వరకు బాధితులకు న్యాయం చేయడానికి మొదటి అడుగు పడలేదు’ అని పేర్కొన్నారు.

ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి కూడా నిరసన తెలపాల్సి రావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు పోలీసు స్టేషన్‌కు వెళ్లడం కూడా ఎందుకు అంత కష్టంగా మారిందని ప్రశ్నించారు. న్యాయం చేయడం కంటే నేరాన్ని దాచిపెట్టడానికే ఎక్కువ ప్రయత్నాలు జరుగుతుంటాయని, ఇందులో ఎక్కువగా బాధితులు మహిళలు, బలహీనవర్గాల ప్రజలేనని తెలిపారు. న్యాయం అనేది ప్రతి పౌరుడి హక్కు అని వెల్లడించారు. కాగా, మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో ఇద్దరు పాఠశాల విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు రాగా..దీనిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపిస్తూ స్థానికులు తీవ్ర ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ పై విధంగా స్పందించారు.

Advertisement

Next Story