ఎఫ్‌డీ‌ల నుంచి 52 కోట్లు కొల్లగొట్టిన బ్యాంకు ఉద్యోగి.. ఎందుకు ?

by Hajipasha |
ఎఫ్‌డీ‌ల నుంచి 52 కోట్లు కొల్లగొట్టిన బ్యాంకు ఉద్యోగి.. ఎందుకు ?
X

దిశ, నేషనల్ బ్యూరో : అతడొక బ్యాంకు అధికారి. బ్యాంకు ఉద్యోగిగా తన ఐడీని, తోటి ఉద్యోగుల ఐడీలను దుర్వినియోగం చేశాడు. వాటితో ఫోర్జరీ, ఛీటింగ్‌కు తెగబడి బ్యాంకు ఖాతాదారుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి దాదాపు రూ.52.99 కోట్లను విత్ డ్రా చేసి, ఇతర అకౌంట్లకు దారిమళ్లించి కొల్లగొట్టాడు. ఢిల్లీ యూనివర్సిటీలోని ఖల్సా కాలేజీ నార్త్ క్యాంపస్‌లో ఉన్న పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ బ్రాంచ్ ఆఫీస్‌లో ఈ బాగోతం చోటుచేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించింది. 2021, 2022 సంవత్సరాల్లో అధికారాన్ని దుర్వినియోగం చేసి రూ.52.99 కోట్లను స్వాహా చేసిన బ్యాంకు అధికారి బెదాన్షు శేఖర్‌ ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడని దర్యాప్తులో వెల్లడైంది. బెదాన్షు శేఖర్‌‌కు ఆన్‌లైన్ గేమ్స్ ఆడే వ్యసనం ఉండేది. పోకర్, తీన్ పత్తీ, మోనోపోలీ వంటి ప్లాట్‌ఫామ్‌లలో తరుచూ ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతుండేవాడు. బ్యాంకు ఖాతాదారుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి మోసపూరితంగా విత్‌డ్రా చేసిన డబ్బును ఇతగాడు.. పలువురు వ్యాపారుల కరెంట్ అకౌంట్లలోకి తొలుత పంపించేవాడు. అనంతరం ఆ కరెంట్ అకౌంట్ల నుంచి గోవా247. లైవ్, ఇండిబెట్.కామ్, బెట్ ‌వే వెబ్ ‌సైట్లకు పేమెంట్స్ చేసేవాడు. ఈ వ్యవహారం ఆడిటింగ్‌లో వెలుగుచూడటంతో గతేడాది నవంబరు 16న నిందితుడు బెదాన్షు శేఖర్ మిశ్రాను ఉద్యోగం నుంచి బ్యాంకు సస్పెండ్ చేసింది. అనంతరం అతడిపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) నిబంధనల కింద కేసు నమోదైంది. తాజాగా ఈడీ రంగంలోకి దిగి బెదాన్షు శేఖర్ మిశ్రాకు చెందిన రూ.2.56 కోట్ల విలువైన స్థిరాస్తి, ఫిక్స్‌డ్ డిపాజిట్లను అటాచ్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed