Bomb Threat: ఢిల్లీలోని పాఠశాలకు బాంబు బెదిరింపులు

by Shamantha N |
Bomb Threat: ఢిల్లీలోని పాఠశాలకు బాంబు బెదిరింపులు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో గురువారం జరిగిన పేలుడు ఘటన మరువకముందే ఢిల్లీలోని పాఠశాలకు(Delhi School) బాంబు బెదిరింపులు(Bomb Threat) రావడం కలకలం సృష్టిస్తోంది. రోహిణి ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలకు (Private school) శుక్రవారం ఈ బెదిరింపులు వచ్చాయి. దుండగులు శుక్రవారం ఉదయం ఈమెయిల్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం.. పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఫైర్ అధికారులు, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని.. విద్యార్థులను, సిబ్బందిని బయటకు పంపించారు. ఆ తర్వాత బాంబ్‌ స్వ్కాడ్‌, డాగ్‌ స్వ్కాడ్‌ సాయంతో పాఠశాల ప్రాంగణంలో తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లభించలేదు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఢిల్లీలో బాంబు పేలుడు

ఢిల్లీ ప్రశాంత్‌ విహార్‌లోని పీవీఆర్‌ మల్టీఫ్లెక్స్‌కు సమీపంలో గురువారం ఉదయం స్వల్ప తీవ్రత గల బాంబు పేలింది. దీంతో స్థానికులు, మల్టీప్లెక్స్‌కు వచ్చిన ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ పేలుడులో ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి తెల్లటి పౌడర్‌ లభ్యమైందని, మరిన్ని వివరాల కోసం దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ప్రశాంత్‌ విహార్‌లోని ఇదే ప్రాంతంలో అక్టోబర్‌ 20న సీఆర్‌పీఎఫ్‌ స్కూల్‌ గోడను ఆనుకొని పేలుడు జరగడం గమనార్హం.



Next Story