Akhilesh Yadav: చంద్రుడి మీదికి వెళ్లడంలో ప్రయోజనమేముంది?- అఖిలేష్ యాదవ్

by Shamantha N |
Akhilesh Yadav: చంద్రుడి మీదికి వెళ్లడంలో ప్రయోజనమేముంది?- అఖిలేష్ యాదవ్
X

దిశ, నేషనల్ బ్యూరో: “కుంభమేళా ట్రాఫిక్ నే నిర్వహించలేనప్పుడు చంద్రుడిపైకి వెళ్లడం వల్ల ప్రయోజనం ఏంటి?” అని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ కేంద్రాన్ని ప్రశ్నించారు. కాగా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. అయితే, ప్రయాగ్ రాజ్ కు భక్తులు వస్తుండటంతో దాదాపు 300 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. అయితే, ఈ విషయాన్నే పార్లమెంటులో అఖిలేష్ యాదవ్ లేవనెత్తారు. యూపీలో 'డబుల్ ఇంజిన్ ప్రభుత్వం' ఉందని చెబుతున్నారు... కానీ 'డబుల్ ఇంజిన్ ప్రభుత్వం' 'డబుల్ బ్లన్డర్స్' చేస్తోంది" అని అఖిలేష్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "కుంభమేళాకు వెళ్లే భక్తులు 300 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు. 'వికసిత్ భారత్' అంటే ఇదేనా? ప్రభుత్వం కనీసం ట్రాఫిక్‌ను కూడా నిర్వహించలేకపోతుంది? భూమిపై ఉన్న సమస్యలను మనం పరిష్కరించలేనప్పుడు చంద్రునిపైకి వెళ్లడం వల్ల ప్రయోజనం ఏంటి?" అని బీజేపీపై విరుచుకుపడ్డారు. ప్రయాగ్ రాజ్ లో ట్రాఫిక్ గందరగోళానికి ఉత్తరప్రదేశ్ సర్కారు, కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.

డ్రోన్లు ఇప్పుడు ఎక్కడున్నాయి?

ప్రయాగ్ రాజ్ లో భక్తుల సమూహాన్ని పర్యవేక్షించేందుకు డ్రోన్లలను ఉపయోగిస్తున్నట్లు యూపీ సర్కారు చెప్పిన వ్యాఖ్యలను లోక్ సభలో ప్రస్తావించారు. "ఆ డ్రోన్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? డిజిటలైజేషన్ (రికార్డుల) గురించి వాదిస్తున్న కేంద్రప్రభుత్వం.. మహా కుంభమేళాలో మరణించిన లేదా తప్పిపోయిన వారి గణాంకాలను ఎందుకు ఇవ్వలేకపోతున్నారు." అని ప్రశ్నించారు. జనవరి 29న మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట గురించి మాట్లాడారు. ఆఘటనలో చనిపోయిన వారి సంఖ్యను తెలపాలని డిమాండ్ చేశారు. "మేము ఈ 'డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని' ప్రశ్నిస్తున్నాము. అపరాధ భావన లేకపోతే... చనిపోయిన వారి సంఖ్యను ఎందుకు దాచారు? సత్యాన్ని దాచడం నేరం. దీనికి శిక్ష ఎవరు అనుభవిస్తారు?" అని మండిపడ్డారు.

Next Story

Most Viewed