రాజ్యాంగ రూపకర్తలను స్మరించుకోవాలి : ప్రధాని మోడీ

by John Kora |
రాజ్యాంగ రూపకర్తలను స్మరించుకోవాలి : ప్రధాని మోడీ
X

- ఈ సారి గణతంత్రం దినోత్సవం చాలా ప్రత్యేకం

- ఎలక్షన్ కమిషన్ పని తీరు భేష్

- కుంభమేళాకు యువత తరలిరావడం సంతోషంగా ఉంది

- మన్‌ కి బాత్‌లో ప్రధాని మోడీ

దిశ, నేషనల్ బ్యూరో:

రాజ్యాంగ రూపకర్తలను స్మరించుకోవల్సిన సమయం ఇది. మనకు పవిత్రమైన రాజ్యాంగాన్ని అందించిన రాజ్యాంగ పరిషత్‌లోని గొప్ప వ్యక్తులందరికీ తలవంచి నమస్కరిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 2025గాను తొలి మన్ కి బాత్‌ను ఆదివారం నిర్వహించారు. వాస్తవానికి ప్రతీ నెల నాలుగో ఆదివారం మన్ కి బాత్‌ను ప్రధాని మోడీ విడుదల చేస్తుంటారు. అయితే ఈ సారి నాలుగో ఆదివారం రిపబ్లిక్ డే రావడంతో ఒక వారం ముందుగానే విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పరిషత్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రాజేంద్ర ప్రసాద్, శ్యామా ప్రసాద్ ముఖర్జీలు చేసిన ప్రసంగాల క్లిప్‌లను శ్రోతలకు వినిపించారు. ఈ సారి రిపబ్లిక్ డే చాలా ప్రత్యేకమైంది. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యింది. మనకు రాజ్యాంగం అందించిన వారందరినీ తప్పకుండా గౌరవించుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.

రాజ్యాంగాన్ని రూపొందించిన వ్యక్తులందరూ నాకు గుర్తున్నారు. రాజ్యాంగ పరిషత్‌లో అనేక చర్చోపచర్చలు జరిగాయి. వారందరూ మనకు వారసత్వ సంపద. అందుకే ఈ రోజు వారి గొంతులను వినిపించాలని భావిస్తున్నాను. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆ సమయంలో అనేక విషయాలను వివరించారు. మీకు ఆ మాటలు వినిపించాలని ఆశిస్తున్నానని ప్రధాని మోడీ అన్నారు. ఈ సందర్భంగా ఆనాటి పాత క్లిప్‌లను కొన్నింటిని మోడీ ప్రదర్శించారు.

ఎన్నికల కమిషన్ సేవలను ప్రధాని మోడీ ప్రశంసించారు. ఈ సందర్భంగా దేశంలోని ప్రజలందరూ భారీ సంఖ్యలో తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అయితే ఏ ఎలక్షన్లు అని చెప్పకుండా భారీగా పోలింగ్ బూత్‌లకు తరలి రావాని మోడీ చెప్పింది పరోక్షంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల గురించే అనే విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. జనవరి 25న మనం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఆ రోజే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను స్థాపించారు. ఆనాటి నుంచి ఈసీ బలోపేతం అవుతూ వచ్చింది. ఎప్పటికప్పుడు ఆధునిక పద్దతులను, టెక్నాలజీని వాడుకుంటూ వోటింగ్ ప్రాసెస్‌ను బలోపేతం చేసిందని ప్రధాని చెప్పారు. ఈసీ కారణంగానే దేశంలో ప్రజాస్వామ్యం కొనసాగుతుందని చెప్పారు.

ఇండియా వంటి అతిపెద్ద దేశంలో మొట్టమొదటి సారిగా ఎన్నికలు నిర్వహించినప్పుడు ప్రజలు ప్రజాస్వామ్యం మీద అనుమానాలు ఉండేవి. కానీ ఎలక్షన్ కమిషన్ కారణంగా ప్రజాస్వామ్యం దృఢంగా కొనసాగుతోంది. దేశంలో నిష్పాక్షికమైన ఎన్నికలు నిర్వహిస్తున్నందుకు గాను ఎలక్షన్ కమిషన్‌ను ప్రధాని మోడీ అభినందించారు.

కుంభమేళా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. ఈ పవిత్ర కార్యక్రమానికి అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజలు హాజరవుతుండటం సంతోషంగా ఉంది. ఇది ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చింది. కుంభమేళాకు యువత భారీ సంఖ్యలో తరలి రావడం అభినందనీయమన్నారు. దేశంలోని యువత మన ఆచార వ్యవహారాలను తెలుసుకున్నప్పడే.. మన మూలాలు బలంగా మారతాయన్నారు.

దేశంలో మరో రెండు కొత్త టైగర్ రిజర్వ్‌లు ఏర్పాటు చేయడం అత్యంత సంతోషంగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో గురు ఘసిదాస్ తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్, మధ్యప్రదేశ్‌లో రాతాపాని టైగర్ రిజర్వ్‌లను ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోడీ తెలిపారు. ఇక యువత స్టార్టప్‌ కంపెనీల వైపు ఆకర్షితులవడం మంచిదని ప్రధాని చెప్పారు. ఇండియా ఇప్పుడు స్టార్టప్‌ల దేశంగా మారిందని అన్నారు. ప్రస్తుతం సమాజంలో పరిస్థితులు అన్నీ మారిపోయాయని.. దేశం డిజిటల్ యుగంలోని ప్రవేశిస్తుందని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో యువత మాత్రమే కాకుండా మహిళలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. తన స్టార్టప్ కంపెనీ ద్వారా నిరాశ్రయులకు సేవ చేస్తున్న దీపక్ నబం అనే వ్యక్తిని ఈ సందర్భంగా మోడీ ప్రశంసించారు.

Next Story