PM Modi: మహాకుంభమేళాపై విమర్శలు.. ప్రతిపక్షాలపై మండిపడ్డ మోడీ

by Shamantha N |
PM Modi: మహాకుంభమేళాపై విమర్శలు.. ప్రతిపక్షాలపై మండిపడ్డ మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత దేశ మత, సాంస్కృతిక సంప్రదాయాలను వ్యతిరేకిస్తున్న వారిపైన ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని ఛత్తార్‌పుర్‌లో భాగేశ్వర్‌ ధామ్‌ మెడికల్‌ అండ్‌ సైన్స్‌ రీసెర్చి సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. అక్కడ జరిగిన సభలో ప్రసంగిస్తూ.. మహాకుంభమేళాపై విమర్శలు చేసిన ప్రతిపక్ష నాయకులను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బానిస మనస్తత్వం కలిగిన వారే దేశ విశ్వాసాలు, సాంస్కృతి సంప్రదాయాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. మహాకుంభమేళాపై విమర్శలను ఉద్దేశిస్తూ.. ‘‘ఇటీవల కాలంలో ప్రజల్ని విభజించే రాజకీయాలు చేస్తున్న నేతల గుంపును చూస్తున్నాం. అనేక సార్లు విదేశీ శక్తులు సైతం వీరందరికి మద్దతు ఇస్తున్నారు. దీంతో, దేశాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. హిందూ విశ్వాసాన్ని ద్వేషించే వ్యక్తులు శతాబ్దాలుగా ఏదో ఒక దశలో ఉంటూనే ఉన్నారు. బానిస మనస్తత్వం కలిగిన వారే దేశ విశ్వాసాలు, నమ్మకాలు, ఆలయాలు, మతం, సంస్కృతి సంప్రదాయాలపై దాడి చేస్తున్నారు. మన పండుగలు, సంప్రదాయాలు, ఆచారాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారి ఎజెండా సమాసంలో ఐక్యతను దెబ్బతీయడమే. ’’ అని మోడీ అన్నారు.

ధీరేంద్రశాస్త్రిపై ప్రశంసలు

అంతేకాకుండా, ఇలాంటి సమయంలో ఎంతో కాలంగా దేశంలో ఐక్యతా మంత్రం గురించి అవగాహన కల్పిస్తోన్న భాగేశ్వర్ ధమ్ కు చెందిన ఆధ్యాత్మిక వేత్త ధీరేంద్ర శాస్త్రిపై మోడీ ప్రశంసలు కురిపించారు. ధీరేంద్ర శాస్త్రి ప్రజల ప్రయోజనాల కోసం పదెకరాల్లో క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలని అనుకోవడం గొప్పవిషయమని అన్నారు. మరోవైపు, ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా జనవరి 13న ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 26వరకు కొనసాగనుంది. కాగా.. త్రివేణి సంగమంలో దాదాపు 45 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని యూపీ సర్కారు అంచనా వేయగా.. ఇప్పటికే 60 కోట్ల మంది గంగాస్నానాలు ఆచరించారు.

Next Story