PM Modi: కాంగ్రెస్ సాగించిన అరాచకాలను అందరూ చూశారు.. విమర్శలకు మోడీ కౌంటర్

by Shamantha N |
PM Modi: కాంగ్రెస్ సాగించిన అరాచకాలను అందరూ చూశారు.. విమర్శలకు మోడీ కౌంటర్
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) స్పందించారు. అంబేద్కర్ వారసత్వాన్ని తుడిచిపెట్టేందుకు కాంగ్రెస్ చేసిన కుట్రలను ప్రజలు చూశారని మండిపడ్డారు. ఈ విషయంపై సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు పెట్టారు. ‘కొన్నేళ్ల పాటు కాంగ్రెస్‌ సాగించిన అరాచకాలు, ముఖ్యంగా అంబేద్కర్‌ను అవమానించిన తీరును అబద్ధాలు చెప్పి దాచలేరు. అలా భావిస్తే వారు పెద్ద పొరబాటు చేసినట్లే. ఎస్సీ, ఎస్టీ వర్గాలను అణగదొక్కోందుకు రాజవంశం నేతృత్వంలోని ఒక పార్టీ చేసిన ప్రయత్నాలను దేశ ప్రజలంతా చూశారు. మనం ఇలా ఉండటానికి అంబేద్కర్ కారణం. గత దశాబ్దకాలంగా ఆయన ఆశయాన్ని నెరవేర్చేందుకు మా ప్రభుత్వం విపరీతంగా కృషి చేసింది. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేయడం, స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన వంటి ప్రధాన కార్యక్రమాలు ప్రతిఒక్కరికీ యూజ్ అయ్యాయి. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న భూసమస్యను మేమే పరిష్కరించాం. తన చివరి క్షణాల్లో అంబేద్కర్ గడిపిన ఢిల్లీలోని 26 అలీపూర్ రోడ్డుని మేమే అభివృద్ధి చేశాం. లండన్ లో ఆయన నివసించిన ఇంటిని మా ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ఆయన్ను సంపూర్ణంగా గౌరవిస్తుంది మేమే. పార్లమెంటులో హోంమంత్రి అమిత్ షా మాట్లాడి కాంగ్రెస్ చీకటి చరిత్రను బయటపెట్టారు. ఆయన మాట్లాడిన వాస్తవాలను చూసి ఆ పార్టీ నేతలు సైతం షాక్ అయ్యారు. అందుకే డ్రామాలు చేస్తున్నారు. నిజయం అందరికీ తెలుసు’ అని మోడీ చెప్పుకొచ్చారు.

అమిత్ షా ఏమన్నారంటే?

రాజ్యసభలో (Rajya Sabha) రాజ్యాంగంపై చర్చ సందర్భంగా మాట్లాడిన అమిత్ షా అంబేద్కర్ ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆ వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అమిత్ షా దళితులను అవమానించారంటూ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఆరోపించారు. బుధవారం పార్లమెంటు ఆవరణలో అంబేడ్కర్ ఫొటో పట్టుకొని నిరసన తెలిపారు. ఆయన హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇస్తూ మోడీ సుదీర్ఘ పోస్టు పెట్టారు.

Advertisement

Next Story