Pm modi: మహా వికాస్ అఘాడీ అవినీతిలో అతిపెద్ద ఖిలాడీ.. ‘ఎంవీఏ’పై ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు

by vinod kumar |
Pm modi: మహా వికాస్ అఘాడీ అవినీతిలో అతిపెద్ద ఖిలాడీ.. ‘ఎంవీఏ’పై ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(Mva) కూటమిపై ప్రధాని నరేంద్ర మోడీ (Pm Narendra modi) తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘మహా వికాస్ అఘాడీ అవినీతిలో అతిపెద్ద ఖిలాడీ’ అని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడంలో కూటమి ఆరితేరిందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలోని చిమూర్‌ (Chimoor)లో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘మహారాష్ట్ర ప్రజలు అనేక దశాబ్దాలుగా రైలు కనెక్టివిటీని డిమాండ్ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్, ఎంవీఏలోని పార్టీలు దానిని ఏనాడూ అనుమతించలేదు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందడం వారికి ఇష్టం లేదు. అభివృద్ధిని అడ్డుకోవడంలో వారు నిపుణులు. అలాగే అవినీతి చేయడంలోనూ ముందున్నారు’ అని వ్యాఖ్యానించారు. గిరిజన సమాజాన్ని కులాల వారీగా విభజించాలని కాంగ్రెస్ కోరుకుంటోందని మండిపడ్డారు.

కాంగ్రెస్ మిత్రపక్షాలు హింస, వేర్పాటువాదంతో రాజకీయంగా లబ్ధి పొందుతున్నాయన్నారు. వేర్పాటువాదం, ఉగ్రవాదం కారణంగా జమ్మూ కశ్మీర్ నిత్యం ఉద్రిక్తంగా ఉండేదని గుర్తు చేశారు. కానీ ఆర్టికల్ 370 రద్దు చేశాక ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చల్లారిందని తెలిపారు. కశ్మీర్‌ను భారతదేశంతో, దాని రాజ్యాంగంతో పూర్తిగా విలీనం చేశామని కొనియాడారు. స్వాతంత్య్రానంతరం దళితులు, వెనుకబడిన తరగతులు, ఆదివాసీలను కాంగ్రెస్‌ ఏనాడూ పట్టించుకోలేదని ఆరోపించారు. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి (Mahayuthi Alliance) భారీ మెజారిటీతో గెలుస్తుందని దీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story