50 ఏళ్ల కిందటి పొరబాటు మళ్లీ జరగొద్దు

by S Gopi |
50 ఏళ్ల కిందటి పొరబాటు మళ్లీ జరగొద్దు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశానికి బాధ్యతాయుతమైన ప్రతిపక్షం అవసరమని, ప్రజలకు కావాల్సింది సమర్థతే కానీ నినాదాలు కాదు. ప్రజల పట్ల శ్రద్ధ, వారిని కలవరపెట్టడం కాదు అని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రతిపక్షాలకు సందేశమిచ్చారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి మంగళవారంతో 50 ఏళ్లు పూర్తవుతాయి. దేశ ప్రాజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ ఓ మచ్చగా మిగిలిపోయింది. ఐదు దశాబ్దాల క్రితం జరిగిన పొరపాటు పునరావృతం కాకూడదని మోడీ తెలిపారు. ఇదే సమయంలో ప్రతిపక్ష ఎంపీలపై విమర్శలు చేశారు. దేశానికి బాధ్యత కలిగిన ప్రతిపక్షం అవసరమని, ప్రాజాస్వామ్య గౌరవాన్ని కాపాడే విధంగా, సామాన్యుల ఆకాంక్షలను నెరవేర్చేలా ప్రతిపక్షాలు ప్రవర్తిస్తాయని ఆశిస్తున్నాను. డ్రామాలు, సభను ఆటంకం ఏర్పరచడాన్ని ప్రజలు కోరుకోవటంలేదు. నినాదాలు చేయాలని అనుకోవట్లేదు. ప్రజల కోరికలను నెరవేర్చేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని మోడీ సూచించారు.

ఇక, 18వ లోక్‌సభ మొదటి సమావేశాలకు ముందు ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడారు. ఇది అద్భుతమైన రోజని, కొత్తగా పార్లమెంటులో అడుగుపెడుతున్న సభ్యులకు స్వాగతం పలుకుతున్నామని, సభ్యులందరినీ కలుపుకుని వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించగలమని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం ప్రధాని మోడీ పార్లమెంటుకు చేరుకున్న అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్వాగతం పలికారు. ఆ తర్వాత మాట్లాడిన ఆయన.. తొలిసారిగా లోక్‌సభ ఎంపీల ప్రమాణస్వీకారం కొత్త పార్లమెంట్ భవనంలో జరిగింది. ఈ సందర్భం కొత్త విశ్వాసంతో సమావేశాలు ప్రారంభిస్తున్నాం. రాజ్యాంగాన్ని గౌరవించి నిర్ణయాలు జరుగుతాయని మోడీ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed