Food poisoning: యూపీ ఫుడ్ పాయిజనింగ్‌ ఘటనలో విద్యార్థి మృతి

by Harish |
Food poisoning: యూపీ ఫుడ్ పాయిజనింగ్‌ ఘటనలో విద్యార్థి మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని మెహ్రూనా గ్రామంలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా 80 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వారంతా కూడా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా, వీరిలో ఒక విద్యార్థి పరిస్థితి క్షీణించి బుధవారం ఉదయం మరణించాడు. ఆ బాలుడి పేరు శివం యాదవ్(15 ఏళ్లు). ఆగస్టు 5న ఫుడ్ పాయిజనింగ్ సంఘటన తరువాత బాలుడి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో అతన్ని డియోరియాలోని మహర్షి దేవరహా బాబా మెడికల్ కాలేజీలో చేర్చారు. మొదట్లో, అతని ఆరోగ్యం నిలకడగా ఉంది, కానీ ఆగస్టు 6 మధ్యాహ్నం, పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించింది. రక్తపోటు భారీగా పెరగడంతో వెంటనే ICUలో చేర్చారు.

అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా అతని ఆరోగ్యంలో చెప్పుకోదగ్గ మెరుగుదల కనిపించకపోవడంతో మెరుగైన చికిత్స కోసం అతన్ని మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో అంబులెన్స్‌ ద్వారా గోరఖ్‌పూర్‌లోని BRD మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినప్పటికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో దురదృష్టవశాత్తు, ఆ బాలుడు బుధవారం ఉదయం మరణించాడు. ఇదిలా ఉంటే డియోరియా మెడికల్ కాలేజీలో 61 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. విద్యార్థులందరూ ఆరోగ్యంగా ఉన్నారని క్రమంగా వారిని డిశ్చార్జ్ చేస్తామని వారు తెలిపారు.

Advertisement

Next Story