Arvind Kejriwal': కాంగ్రెస్, బీజేపీ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి- కేజ్రీవాల్

by Shamantha N |
Arvind Kejriwal: కాంగ్రెస్, బీజేపీ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి- కేజ్రీవాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Elections) వేళ రాజకీయాలు హీటెక్కాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. ఈ పరిణామాల మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాహుల్‌గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు ప్రతిస్పందిస్తున్నారని అన్నారు. దీంతో కాంగ్రెస్‌, బీజేపీకి మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే విషయం ప్రజలకు అర్థమవుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు, బీజేపీకి ఉన్న అనుబంధం ఢిల్లీ ఎన్నికల్లో బయటపడుతోందన్నారు. కాగా.. తనపై కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై ఆమ్‌ఆద్మీపార్టీ (AAP) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, రాహుల్ పై కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ (BJP) సీనియర్‌ నేత, అమిత్ మాల్వియా స్పందించారు. ‘దేశం గురించి తర్వాత ఆలోచించండి.. ముందు మీ ఢిల్లీ సీటును కాపాడుకోండి’ అని పోస్ట్‌ చేశారు. దీనిపై కేజ్రీవాల్‌ ఈ కామెంట్లు చేశారు.

రాహుల్ ఏమన్నారంటే?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీలంపుర్‌లో జరిగిన సభలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ ఆప్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మోడీ అనుసరించే ప్రచారం, అబద్ధపు హామీల బాటలో కేజ్రీవాల్‌ నడుస్తున్నారని అన్నారు. కాలుష్యం, అవినీతి, ధరల పెరుగుదలను వారిద్దరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. కులగణనపై మోడీ, కేజ్రీవాల్‌ మౌనంగానే ఉండిపోయారని విమర్శించారు. ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే కులగణన చేపడతామ్ననారు. రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీని రక్షించుకోవడానికి రాహుల్‌ గాంధీ ప్రయత్నిస్తున్నారని, తాను దేశరక్షణ కోసం కృషి చేస్తున్నానన్నారు. రాహుల్‌ మాటలు పట్టించుకోనన్నారు. 70 శాసనసభ స్థానాలు ఉన్న దిల్లీకి ఒకేవిడతలో ఫిబ్రవరి 5న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్‌ వెల్లడించారు.

Advertisement

Next Story