Pensioners Huge Protest:సెప్టెంబర్ 25 న.. పెన్షనర్ల దేశవ్యాప్త రాష్ట్ర స్థాయి మహా ధర్నాలు

by Geesa Chandu |   ( Updated:2024-09-24 16:18:13.0  )
Pensioners Huge Protest:సెప్టెంబర్ 25 న.. పెన్షనర్ల దేశవ్యాప్త రాష్ట్ర స్థాయి మహా ధర్నాలు
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం(Central Government) ఉద్యోగ, పెన్షనర్ల వ్యతిరేక విధానాలను విడనాడాలని, 8 వ కేంద్ర పే కమీషన్(Pay Commission) వెంటనే ఏర్పాటు చేయాలని, వైద్య సౌకర్యాలలో కోత విధింపును నిరసిస్తూ ఆరోగ్య పథకాలను మెరుగు పర్చాలని తదితర పెండింగ్ లో ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ.. సెప్టెంబర్ 25 న దేశవ్యాప్తంగా పెన్షనర్లు రాష్ట్ర స్థాయి ధర్నాలు నిర్వహించాలని నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ (ఎన్సీసీపీఏ) పిలుపునిచ్చింది.

హైదరాబాద్ కోఠీ ఉమెన్స్ కాలేజీ ఎదురుగా ఉన్న నిర్మాణ్ భవన్ (కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్) వద్ద బుధవారం ఉదయం 10 గంటల నుంచి జరిగే ధర్నాలో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల తో పాటు బీఎస్ఎన్ఎల్(BSNL) తదితర రిటైర్డ్ ఉద్యోగులు(Retired Employees) పాల్గొంటారని టాప్రా నాయకులు ఎన్.సోమయ్య తెలిపారు. విశాఖపట్నం జీవీఎంసీ ఆఫీసు ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద ఉదయం 9 గంటల నుంచి జరుగు భారీ ధర్నాలో రైల్వే, డిఫెన్స్ తదితర కేంద్ర పెన్షనర్లు పాల్గొంటారని పెన్షనర్ల నాయకులు ఎం.చంద్రశేఖర రావు పేర్కొన్నారు.

కోవిడ్ సమయంలో నిలిపివేసిన 18 నెలల డీఏ(DA) / డీఆర్(DR) బకాయిలను విడుదల చేయాలని, రైల్వేలో సీనియర్ సిటిజన్లకు రాయితీ పునరుద్ధరించాలని, ప్రతి ఐదేళ్లకు 5 శాతం పెన్షన్ పెంచాలని, ఫిక్స్ డ్ మెడికల్ అలవెన్సు పెంచాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సులను అమలు పర్చాలని ఎన్సీసీపీఏ నాయకులు పాలకుర్తి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు.బీఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగులకు 01.01.2017 నుంచి 15 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని, బ్యాంకు పెన్షనర్లకు పెన్షన్ అప్ డేట్ చేయాలని ఏఐబీడీపీఏ కార్యదర్శి రామచంద్రుడు కోరారు.

12 సంవత్సరాలకే పెన్షన్ కమ్యుటేషన్, రిటైర్మెంట్ ముందు 12 నెలల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులందరికీ నేషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేసి సుప్రీంకోర్టు తీర్పును నిజస్ఫూర్తితో అమలు పరచాలని, నేషనల్ లిటిగేషన్ పాలసీని రూపొందించాలని, పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) ను పునరుద్ధరించాలని సీసీజీజీఓఓ జాతీయ చైర్మన్ వి.కృష్ణ మోహన్ విజ్ఞప్తి చేశారు.ఉద్యోగుల, పెన్షనర్ల న్యాయబద్ధమైన కోర్కెలన్నింటినీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తిరస్కరించినందున, కోర్టు తీర్పులను ఖాతరు చేయనందున, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సిఫార్సులను కూడా అంగీకరించనందున ఆందోళనా కార్యక్రమాలను దశల వారీగా ఐక్యంగా తీవ్రతరం చేస్తామని వి.కృష్ణ మోహన్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed