ఈసీ నోటీసుల్లో కానరాని మోడీ, రాహుల్‌, ఖర్గే పేర్లు!

by Dishanational4 |
ఈసీ నోటీసుల్లో కానరాని మోడీ, రాహుల్‌, ఖర్గే పేర్లు!
X

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) రంగంలోకి దిగింది. విద్వేష ప్రసంగాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ వారిద్దరిపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన చర్యలను మొదలుపెట్టింది. ప్రధాని మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడినందుకుగానూ వివరణ కోరుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలకు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్‌ 29న ఉదయం 11 గంటల్లోగా ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని వారిని ఆదేశించింది. అయితే ఈ నోటీసుల్లో ఎక్కడా మోడీ, రాహుల్‌, ఖర్గే పేర్లను ఈసీ నేరుగా ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇదే సమయంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం పలు కీలక సూచనలు చేసింది. ‘‘రాజకీయ పార్టీల స్టార్ క్యాంపెయినర్లు బాధ్యతాయుతంగా ప్రసంగాలు చేయాలి. వారి ప్రవర్తనకు, వ్యాఖ్యలకు రాజకీయ పార్టీలే బాధ్యత వహించాలి. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి విద్వేష ప్రసంగాలు చేస్తే అవి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి’’ అని ఈసీ హెచ్చరించింది.

పరస్పర ఫిర్యాదులు..

ఇటీవల రాజస్థాన్‌లో ప్రధాని మోడీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎంలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఇదే సమయంలో రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ కూడా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఈ ఫిర్యాదులను స్వీకరించిన ఈసీ తొలిసారి ఉల్లంఘనగా భావించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు నోటీసులిచ్చింది. ‘‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల సంపదను మైనార్టీలకు పంచి పెడుతుంది. మెజారిటీ వర్గం మహిళల మంగళసూత్రాలను కూడా కాంగ్రెస్ వదిలిపెట్టదు’’ అని రాజస్థాన్‌లోని ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఇక రాహుల్ గాంధీ తన ప్రసంగాలతో దేశాన్ని విభజించాలని చూస్తున్నారని, పేదరికంపైనా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. దళితుడిననే కారణంతో తనను అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు పిలవలేదని వ్యాఖ్యానించడం ద్వారా కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది.



Next Story

Most Viewed