Delhi CM: అరెస్టుపై ఢిల్లీ సీఎం అతిషీ కీలక వ్యాఖ్యలు

by Shamantha N |
Delhi CM: అరెస్టుపై ఢిల్లీ సీఎం అతిషీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో : సంక్షేమ పథకాల(welfare schemes)పై పత్రికల్లో వచ్చిన పబ్లిక్ నోటీసులు తప్పుడు వార్తలని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషీ(Delhi CM Atishi) అన్నారు. అదంతా బీజేపీ నేతల కుట్ర అని చెప్పుకొచ్చారు. ఆప్ ప్రభుత్వాన్ని నిందించేందుకే బీజేపీ నేతలు కొంతమంది అధికారులపై ఒత్తిడి తెచ్చి పబ్లిక్ నోటీసు వచ్చేలా చేశారని ఆరోపించారు. ‘కొంతమంది అధికారులపై ఒత్తిడితెచ్చి బీజేపీ ఈ నోటీసులు ప్రచురించింది. ఆయా అధికారులపై చర్యలు తీసుకుంటాం. ఢిల్లీ మహిళలకు ఉచిత బస్సు సర్వీసు నిలిపివేసేందుకు, నాపై తప్పుడు కేసు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని మా వద్ద సమాచారం ఉంది. వారు నన్ను అరెస్టు చేసినా.. నాకు న్యాయవ్యవస్థ, రాజ్యాంగంపై నమ్మకం ఉంది. నాకు బెయిల్ వస్తుంది’ అని తెలిపారు.

హెచ్చరికలు జారీ చేస్తూ ప్రకటన

కాగా.. మరోసారి అధికారంలోకి వస్తే ‘మహిళా సమ్మాన్‌ యోజన’ కింద మహిళలకు ప్రతినెలా రూ.2,100 ఆర్థికసాయం చేస్తామని ఆప్‌ (AAP) ప్రకటించింది. అంతేకాకుండా ‘సంజీవని యోజన’ కింద ఢిల్లీలోని వృద్ధులకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు కూడా స్వీకరిస్తోంది. కాగా.. ఈ పథకాలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేస్తూ పత్రికల్లో ప్రకటన వెలువరింది. ‘మహిళా సమ్మాన్ యోజన కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు రూ.2,100 ఇస్తామని మీడియా కథనాల ద్వారా మా దృష్టికి వచ్చింది. ఈ స్కీంకి సంబంధించి మా దగ్గర ఎలాంటి సమాచారం లేదు. ఢిల్లీ ప్రభుత్వం అలాంటి స్కీమ్‌ను నోటిఫై చేయలేదు. అంతేకాక ఢిల్లీలో ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో సంజీవని పథకం లేదు. ఈ పథకానికి సంబంధించి వృద్ధుల వ్యక్తిగత సమాచారం లేదా డేటాను సేకరించే అధికారం ఎవరికీ ఇవ్వలేదు’ అని మహిళా, శిశు అభివృద్ధి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్, అతిషీ మీడియా సమావేశం నిర్వహించారు.

Advertisement

Next Story

Most Viewed