Delhi Liquor Scam: మనీష్‌ సిసోడియాకు లభించని ఊరట.. బెయిల్ విచారణ వాయిదా

by Vinod kumar |
Delhi Liquor Scam: మనీష్‌ సిసోడియాకు లభించని ఊరట.. బెయిల్ విచారణ వాయిదా
X

న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియాకు మధ్యంతర బెయిల్ ఇచ్చేటందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఈడీ, సీబీఐ కేసుల్లో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సెప్టెంబర్ 4కు వాయిదా వేసింది. తన భార్య అనారోగ్య కారణాలను చూపుతూ సిసోడియా మధ్యంతర బెయిల్‌ను కోరారు. న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సిసోడియా భార్య వైద్య రికార్డులను పరిశీలించింది. ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉన్నందున.. ఈ కేసులలో సిసోడియా రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ల వాదనలు వినేటప్పుడే మధ్యంతర బెయిల్ పిటిషన్‌లను కూడా పరిగణనలోకి తీసుకుంటామని బెంచ్ స్పష్టం చేసింది.

దీంతో మరింతకాలం మనీశ్ సిసోడియా జైల్లోనే ఉండనున్నారు. కోర్టులో సిసోడియా తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, సిసోడియా భార్య ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి ధర్మాసనానికి తెలియజేశారు. లిక్కర్ పాలసీ రూపకల్పనలో అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలతో సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం పలుమార్లు సిసోడియా కోర్టు మెట్లు ఎక్కినప్పటికీ ఆయనకు మాత్రం ఊరట లభించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed