Nitin Gadkari: పంజాబ్ సీఎంకు గడ్కరీ హెచ్చరిక.. ప్రాజెక్ట్ క్యాన్సల్..

by Harish |   ( Updated:2024-08-10 13:04:40.0  )
Nitin Gadkari: పంజాబ్ సీఎంకు గడ్కరీ హెచ్చరిక.. ప్రాజెక్ట్ క్యాన్సల్..
X

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్‌లో రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న ఇంజనీర్లు, కాంట్రాక్టర్లపై జరుగుతున్న దాడులపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోకుంటే, పంజాబ్‌లో 293 కి.మీ.ల పొడవుతో రూ.14,288 కోట్లతో నిర్మిస్తున్న హైవే ప్రాజెక్టులను రద్దు చేస్తామని హెచ్చరిస్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్‌కు లేఖ రాశారు.

ఢిల్లీ-కత్రా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న సిబ్బందిపై దాడులు చేసినట్లు సమాచారం అందింది. జలంధర్ జిల్లాలో కాంట్రాక్టర్ ఇంజనీర్‌పై దారుణంగా దాడి చేశారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పటికీ, బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. లూథియానా జిల్లాలో ప్రాజెక్ట్ క్యాంప్‌పై దుండగులు దాడి చేసి క్యాంపును, దాని సిబ్బందిని సజీవ దహనం చేస్తామని బెదిరించారు. ఈ బెదిరింపులు, దాడులపై ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు స్థానిక పోలీసులకు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు, నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

ఇలా అయితే రాష్ట్రంలో 293 కి.మీల పొడవుతో నిర్మిస్తున్న రోడ్డుతో పాటు మరో 8 ప్రాజెక్టులను రద్దు చేయాల్సి వస్తుంది. ఇవి ప్రధానంగా గ్రీన్‌ఫీల్డ్ కారిడార్లు, ఒక ప్రాజెక్ట్‌ను రద్దు చేసినట్లయితే మొత్తం కారిడార్ నిరుపయోగంగా మారుతుందని పంజాబ్ సీఎంకు రాసిన లేఖలో నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

ప్రధానంగా ప్రాజెక్ట్‌ల వద్ద భూసేకరణతో శాంతిభద్రతల సమస్య వచ్చింది. భూసేకరణ సవాళ్ల కారణంగా ఎన్‌హెచ్‌ఏఐ ఇప్పటికే రూ.3,263 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టులను రద్దు చేసిందని మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు, గుత్తేదారుల సిబ్బంది విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గడ్కరీ కోరారు.

Advertisement

Next Story

Most Viewed