శౌర్యచక్ర అవార్డీ హత్య వెనుక కెనడా ఖలిస్తానీలు.. ఎన్ఐఏ సంచలన ఆరోపణలు

by Mahesh Kanagandla |
శౌర్యచక్ర అవార్డీ హత్య వెనుక కెనడా ఖలిస్తానీలు.. ఎన్ఐఏ సంచలన ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు భారత్, కెనడాల మధ్య దూరాన్ని పెంచింది. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల హస్తమున్నదని కెనడా తీవ్ర ఆరోపణలు చేయగా.. భారత్ ఘాటుగా స్పందించింది. దౌత్య అధికారుల బహిష్కరణలతో ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో కెనడాలోని ఖలిస్తానీలపై సుప్రీంకోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాఖలు చేసిన అఫిడవిట్ వివరాలు బయటికి వచ్చాయి. శౌర్యచక్ర అవార్డీ, టీచర్ బల్విందర్ సింగ్ సంధు హత్య వెనుక కెనడాలోని ఖలిస్తానీలు ఉన్నట్టు ఎన్ఐఏ ఆ అఫిడవిట్‌లో ఆరోపణలు చేసింది.

1990లో మిలిటెన్సీపై పోరాటానికిగాను బల్విందర్ సింగ్ సంధుకు ఈ గ్యాలంట్రీ అవార్డు దక్కింది. 2020లో తర్న్ తరన్‌లోని తన నివాసం బయట సంధును కొందరు దుండగులు హతమార్చారు. ఈ శౌర్య చక్ర అవార్డీ బల్విందర్ సింగ్ సంధును కెనడాలోని ఖలిస్తానీలు కుట్ర చేసి హతమార్చారని ఇటీవలే సుప్రీంకోర్టులో ఎన్ఐఏ వెల్లడించింది. సంధు హత్య కేసులో అరెస్టు చేసిన నిందితులు దర్యాప్తులో వెల్లడించిన విషయాలను అఫిడవిట్‌లో పేర్కొన్నట్టు తెలిపింది. సంధును హత్య చేసే బాధ్యతను నిషేధిత ఉగ్ర సంస్థ ఖలిస్తానీ లిబరేషన్ ఫోర్స్‌ సభ్యుడు, కెనడాలో కేఎల్ఎఫ్ ఆపరేటివ్‌ సుఖ్‌మిత్ పాల్ సింగ్ అలియాస్ సన్నీ టొరంటో, ఖలిస్తానీ వేర్పాటువాది జర్నెల్ సింగ్ బింద్రెన్‌వాలే బంధువు లఖ్‌వీర్ సింగ్ అలియాస్ రోడ్‌లు తమకు అప్పగించారని నిందితులు దర్యాప్తులో పేర్కొన్నట్టు వివరించింది. ఈ కేసులో వీరిద్దరినీ ఎన్ఐఏ నిందితులుగా చేర్చి.. పరారీలో ఉన్నట్టుగా పేర్కొంది. ఖలిస్తానీ వ్యతిరేకులను హతమార్చి ఆ ఉద్యమాన్ని మళ్లీ పునరుత్తేజం చేయవచ్చునని వీరు భావించినట్టు తెలిపింది.

ఇందర్జిత్ అలియాస్ ఇందర్ వంటి ర్యాడికల్‌గా మారిన యువతను సన్నీ టొరంటో, లఖ్‌వీర్ సింగ్‌లు కలుసుకుని సంధు హత్యకు హైర్ చేసుకున్నట్టు ఎన్ఐఏ పేర్కొంది. సాయుధ పోరాటంతో ఖలిస్తాన్‌ను ఏర్పాటు చేయాలన్నదే ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ ప్రధాన లక్ష్యం అని వివరించింది. జర్నేల్ సింగ్ బింద్రన్‌వాలే భావజాలాన్ని వ్యతిరేకించినవారిని హతమార్చి ఖలిస్తాన్ ఉద్యమాన్ని పునరుత్తేజం చేయాలని వారు అనుకున్నారని తెలిపింది. ఇందులో భాగంగానే సంధు వారి చేతుల్లో బలయ్యారని పేర్కొంది.

Advertisement

Next Story