అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు.. ఏం మారుతున్నాయో తెలుసా?

by Swamyn |
అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు.. ఏం మారుతున్నాయో తెలుసా?
X

దిశ, నేషనల్ బ్యూరో: వలస పాలనలోని చట్టాల స్థానంలో తీసుకొచ్చిన నూతన క్రిమినల్ చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్రం శనివారం అధికారికంగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రస్తుతమున్న ‘ఇండియన్ పీనల్ కోడ్’(ఐపీసీ) స్థానంలో కేంద్రం ‘భారతీయ న్యాయ సంహిత’(బీఎన్ఎస్)ను తీసుకురాగా, ‘క్రిమినల్ ప్రొసీజర్ కోడ్’(సీఆర్పీసీ) స్థానంలో ‘భారతీయ నాగరిక్ సురక్ష సంహిత’(బీఎన్ఎస్ఎస్), ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ‘భారతీయ సాక్ష్య అధినియం’(బీఎస్ఏ) చట్టాలను ప్రవేశపెట్టింది. దీంతో ఈ కొత్త చట్టాల్లో ఏమేం మార్పులు ఉండబోతున్నాయనే ప్రశ్నలు చాలా మందిలో మెదులుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త చట్టాల్లో తీసుకొచ్చిన కొన్ని ప్రధాన మార్పులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

* ఐపీసీ ప్రకారం, సెక్షన్ 302 హత్యకు శిక్షను పరిగణించింది. ఇప్పుడు బీఎన్ఎస్‌లో హత్య 101 సెక్షన్ కిందకు వస్తుంది. 302ను స్నాచింగ్‌‌కు సంబంధించిన నేరంగా పరిగణిస్తారు.

* మోసానికి పాల్పడితే ఐపీసీ ప్రకారం 420 కింద కేసు నమోదు చేస్తారు. కానీ, కొత్త చట్టంలో 420 అనే(సంఖ్య) సెక్షన్ లేదు. మోసానికి పాల్పడితే బీఎన్ఎస్ 316 కింద కేసు నమోదు చేయాల్సి ఉంటుంది.

* చట్టవిరుద్ధంగా నిర్వహించే సమావేశాలకు ఐపీసీ సెక్షన్ 144 ఉండగా, ఇకపై సెక్షన్ 187 కింద కేసు పెట్టాల్సి ఉంటుంది.

* ఐపీసీ సెక్షన్ 121 ప్రకారం, యుద్ధం చేయడం, లేదా యుద్ధం చేయడానికి ప్రయత్నించడం లేదా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధానికి ప్రోత్సహించడం వంటి నేరాలకు పాల్పడటం. ఇవి ఇప్పుడు సెక్షన్ 146 కిందకు రానున్నాయి.

* పరువు నష్టాన్ని సూచించే ఐపీసీ సెక్షన్ 499, ఇప్పుడు కొత్త చట్టంలోని సెక్షన్ 354 కిందకు వస్తుంది.

* లైంగికదాడి శిక్ష ఇప్పటివరకు ఐపీసీ సెక్షన్ 376 కిందకు రానుండగా, ఇకపై బీఎన్ఎస్ సెక్షన్ 63కిందకు రానుంది. సామూహిక లైంగిక లైంగికదాడి నేరం సెక్షన్ 70కిందకు రానుంది.

* దేశద్రోహానికి సంబంధించిన కేసు ఐపీసీలో సెక్షన్ 124-ఏ ఉండగా, ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం సెక్షన్ 150గా పిలువనున్నారు. అయితే, దేశ ద్రోహం(సెడిషన్) అనే పదాన్ని తొలగించారు.

ఐపీసీలో తగ్గిన సెక్షన్‌లు

కీలకమైన ఐపీసీలో 511 సెక్షన్‌లు ఉండగా, వాటిని బీఎన్ఎస్‌లో 358 సెక్షన్లకు తగ్గించి, 20 నేరాలకు సంబంధించి కొత్త సెక్షన్‌లను జోడించారు. అయితే, మిగతా రెండు చట్టాల్లో మాత్రం సెక్షన్లు పెరిగాయి. సీఆర్పీసీ 484 సెక్షన్‌లు ఉండగా, బీఎన్ఎస్ఎస్‌లో అవి 531కి పెరిగాయి. ఎవిడెన్స్ యాక్ట్‌లో 166 సెక్షన్‌లు ఉండగా, బీఎస్ఏలో అదనంగా నాలుగు సెక్షన్‌లు పెరిగి 170కి చేరాయి.

దేశద్రోహం తొలగింపు కానీ..

కొత్త చట్టాల్లో దేశద్రోహం కేసు తొలగించినప్పటికీ సాయుధ తిరుగుబాటు, విధ్వంసక, వేర్పాటువాద కార్యకలాపాలు మాత్రం నేరాలుగానే పరిగణింపబడగాయి. “ఏదైనా కార్యకలాపాలు దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, ఐక్యతకు వ్యతిరేకంగా ఉన్నట్టయితేనే దానిని దేశద్రోహంగా పరిగణిస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు. కానీ, దేశ భద్రత, త్రివర్ణ పతాకం, ప్రభుత్వ ఆస్తులకు ఆటంకం కలిగిస్తే వారు జైలుకు వెళ్తారు’’ అని పార్లమెంటులో బిల్లుపై చర్చించే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరించారు.

తీవ్రవాదం

కొత్త చట్ట ప్రకారం, దేశ శ్రేయస్సుకు వ్యతిరేకంగా పేలుడు పదార్థాలు, విష వాయువులు మొదలైనవాటిని ఉపయోగించే ఏ వ్యక్తినైనా ఉగ్రవాదిగానే పరిగణించాలి. బీఎన్ఎస్ ప్రకారం, టెర్రరిజం సెక్షన్ 113(1) కిందకు వస్తుంది.

గైర్హాజరీలో విచారణ

కేసు విచారణ సమయంలో భారతదేశం వెలుపల దాక్కున్న నిందితుడు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి 90 రోజులలోపు కోర్టుకు హాజరుకాకపోతే, వారు గైర్హాజరైనప్పటికీ విచారణ కొనసాగుతుంది. ప్రాసిక్యూషన్ కోసం పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమిస్తారు.

లైంగికదాడులు

18 ఏళ్లలోపు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితులు ఐపీసీలోని లొసుగులను వాడుకుని తప్పించుకోవడానికి వీలు లేకుండా, ఈ కేసులన్నీ ‘పోక్సో’ చట్టం కిందికే తీసుకొచ్చారు. అలాగే, సామూహిక లైంగికదాడికి 20ఏళ్ల జైలు శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని నూతన చట్టం చెబుతోంది. మైనర్‌లపై లైంగికదాడికి పాల్పడితే జీవితాంతం జైలు లేదా మరణశిక్ష విధించడం తప్పనిసరి.


Advertisement

Next Story

Most Viewed