Maharashtra : నేపాల్‌లో బస్సు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు చెరో రూ.5 లక్షలు : సీఎం షిండే

by Hajipasha |
Maharashtra : నేపాల్‌లో బస్సు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు చెరో రూ.5 లక్షలు : సీఎం షిండే
X

దిశ, నేషనల్ బ్యూరో : నేపాల్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 25 మంది మహారాష్ట్ర వాసుల కుటుంబాలకు సీఎం ఏక్‌నాథ్ షిండే చెరో రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. చనిపోయిన 25 మంది యాత్రికులు కూడా జల్‌గావ్ జిల్లా వాస్తవ్యులే అని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత శుక్రవారం రోజు ఉత్తరాఖండ్‌కు చెందిన ట్రావెల్స్ బస్సు కొండ ప్రాంతంలో అదుపుతప్పి 150 మీటర్ల ఎత్తు నుంచి నేపాల్‌లోని ఓ నదిలోకి పడిపోయింది. ఈ ఘటనలో బస్సులోని 43 మందిలో 41 మంది చనిపోయారు. మృతుల్లో 27 మందిని భారతీయులుగా గుర్తించారు.

వీరిలో 25 మంది మహారాష్ట్రవాసులు కాగా, ఇద్దరు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ వాస్తవ్యులు. ఇక ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఆర్థికసాయం అందిస్తామని ప్రధాని మోడీ ఇప్పటికే ప్రకటించారు. గాయపడినవారికి రూ.50వేలు చొప్పున సాయం చేస్తామని వెల్లడించారు. కాగా, ఉద్యోగుల సామాజిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీం (యూపీఎస్)‌కు మహారాష్ట్ర క్యాబినెట్ ఆదివారం ఆమోదం తెలిపింది.

Advertisement

Next Story