నీట్-యూజీ పరీక్ష రద్దు హేతుబద్దం కాదు.. అభ్యర్థులకు నష్టం: కేంద్రం

by S Gopi |
నీట్-యూజీ పరీక్ష రద్దు హేతుబద్దం కాదు.. అభ్యర్థులకు నష్టం: కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా వివాదం చెలరేగిన నీట్-యూజీ 2024 పరీక్షలకు సంబంధించి కేంద్రం భారత అత్యున్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ పరీక్షలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టు రుజువులు లేనందున మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొంది. పరీక్షను పూర్తిగా రద్దు చేయడం వల్ల లక్షలాది మంది నిజాయితీ కలిగిన అభ్యర్థులు నష్టపోతారని, వారి ప్రయోజనాలు దెబ్బతింటాయని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ తన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేశామని, అక్రమాలపై సీబీఐ సమగ్ర దర్యాప్తును ఆదేశాలిచ్చామని కేంద్రం వెల్లడించింది. భారీ స్థాయిలో అవకతవకలు జరిగిన ఆధారాలు లేనప్పుడు మొత్తం పరీక్షను, ఇప్పటికే ప్రకటించిన ఫలితాలను రద్దు చేయడం హేతుబద్దం కాదని కేంద్రం వివరించింది. పోటీ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడంపై కట్టుబడి ఉన్నట్టు పేర్కొంది. నీట్ పరీక్షల వ్యవహారంలో పరీక్షల రద్దు డిమాండ్‌తో దాదాపు 26 పిటిషన్‌లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వీటిని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ జేబీ పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం జూలై 8న విచారణ చేపట్టనుంది. ఇప్పటివరకు దాఖలైన పిటిషన్‌లపై సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు కేంద్రానికి ఆదేశించిన నేపథ్యంలో శుక్రవారం ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.

ఇక, ఇదే వ్యవహారానికి సంబంధించి ఎన్‌టీఎ సైతం అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ పరీక్షను రద్దు చేయడం వల్ల లక్షలాది విద్యార్థులు నష్టపోతారని, పేపర్ లీక్ ఘటన కారణంగా మొత్తం పరీక్ష నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తలేదని వివరించింది. నీట్ యూజీ పరీక్షను న్యాయబద్దంగా నిర్వహించామని, ఇందులో అక్రమాలు జరిగినట్టు దాఖలైన పిటిషన్‌లు నిరాధారమని కోర్టుకు విన్నవించింది.

Next Story

Most Viewed