పరారైన నీట్ పేపర్ లీక్ సూత్రధారి

by S Gopi |
పరారైన నీట్ పేపర్ లీక్ సూత్రధారి
X

దిశ, నేషనల్ బ్యూరో: నీట్ పేపర్ లీక్ కేసులో రోజుకొక ఆసక్తికర పరిణామం బయటపడుతోంది. ఈ నేపథ్యంలోనే వ్యవహారంలో సూత్రధారిగా భావిస్తున్న ధారశివ్ జిల్లాలోని ఉమర్గాలో ఉపాధ్యాయుడు ఈరన్న మష్నాజీ కొంగుల్వార్ తన భార్యతో కలిసి పరారైనట్టు స్థానిక పోలీసులు బుధవారం తెలిపారు. ఇటీవలే నాందేడ్ ఏటీఎస్ ఈరన్నను విచారించి, తర్వాత విడుదల చేసింది. ఆ తర్వాత అతను కనిపించకుండా పోయాడని సంబందిత వర్గాలు తెలిపాయి. శనివారం ఉదయం ఈరన్న తన భార్య, కొడుకు, ఇద్దరు కూతుళ్లతో కలిసి పారిపోయారని స్థానికుల ద్వారా తెలుస్తోంది. ఈరన్న కుమార్తె యూజీ నీట్‌లో మూడుసార్లు ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కొంగుల్వార్‌తో పాటు మరో ఇద్దరు సంజయ్ తుకారాం జాదవ్, జలీల్ ఉమర్ఖాన్ పఠాన్‌లు నిందితులుగా ఉన్నారు. సంజయ్, జలీల్‌ల నుంచి డబ్బు తీసుకుని ఈరన్న ఢిల్లీకి చెందిన గంగాధర్‌కు పంపేవాడని సమాచారం.

మరోవైపు, మహారాష్ట్రలోని లాతూర్‌లోని హౌసింగ్ సొసైటీలో ఈరన్న మష్నాజీ కొంగుల్వార్ ఉన్న ఇంటికి వెళ్లిన జాతీయ మీడియాకు పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఈరన్న ఇంటి ఆవరణలో సగం తెరిచిన కిటీకీలు, బయట వరండాలో వదిలేసిన రెండు స్కూటర్లు, ఇంటి లోపల ఆన్‌లో ఉంచిన లైట్లు, ఫ్యాన్‌లు ఉన్నట్టు గమనించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఈరన్నకు ఉచ్చు బిగుసుకుపోవడంతో ఇంటిని హడావుడిగా వదిలి పారిపోయినట్టు పరిసరాలు కనిపించాయి. కాగా, ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అనేక అరెస్టులు జరిగాయి. బీహార్‌లోని నలుగురితో మొదలై, నీట్ అభ్యర్థులలో ఒకరైన అనురాగ్ యాదవ్‌తో సహా పలువురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed