NEET : నీట్-యూజీ రిజల్ట్.. ఆరుగురు టాపర్ల ఎగ్జామ్ సెంటర్‌లో లెక్క మారింది

by Hajipasha |   ( Updated:2024-07-20 19:17:31.0  )
NEET : నీట్-యూజీ రిజల్ట్.. ఆరుగురు టాపర్ల ఎగ్జామ్ సెంటర్‌లో లెక్క మారింది
X

దిశ, నేషనల్ బ్యూరో: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశంలోని నగరాలు, పరీక్షా కేంద్రాల వారీగా ‘నీట్‌-యూజీ’ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) శనివారం మధ్యాహ్నం విడుదల చేసింది. దీనికి సంబంధించిన లిస్టును తమ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. అయితే ఫలితాల్లో విద్యార్థుల గుర్తింపు బహిర్గతం కాకుండా ఎన్టీఏ జాగ్రత్తపడింది. సుప్రీంకోర్టు తాజాగా నిర్దేశం మేరకే ఆ విధంగా చేసింది. ఈ ఏడాది మే 5న నీట్-యూజీ ఎగ్జామ్ జరిగింది. మిగతా పరీక్షా కేంద్రాలతో పోలిస్తే ప్రశ్నాపత్రం లీకైనట్లుగా భావిస్తున్న పరీక్షా కేంద్రాల్లో నీట్-యూజీ రాసిన అభ్యర్థులకు ఎక్కువ మార్కులు వచ్చాయా ? లేదా ? అనేది తెలుసుకోవడానికే ఈ లిస్టును విడుదల చేయాలని ఎన్‌టీఏను సుప్రీంకోర్టు కోరింది. ఈ వ్యవహారంపై జులై 22న సుప్రీంకోర్టు తదుపరి విచారణను చేపట్టనుంది.

ఆ కేంద్రాల్లో రిజల్ట్ మారింది..

అంతకుముందు జూన్‌ 4న వెలువడిన నీట్‌ యూజీ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 67 మందికి మొదటి ర్యాంక్‌ వచ్చింది. అప్పట్లో గ్రేస్ మార్కుల వ్యవహారంలో హర్యానాలోని ఝజ్జర్‌లో ఉన్న హర్ దయాళ్ పరీక్షా కేంద్రం వివాదాస్పదంగా మారింది. గ్రేస్ మార్కులను రద్దు చేశాక.. ఇదే కేంద్రంలో రెండోసారి నీట్ - యూజీ పరీక్ష రాసిన 494 మంది అభ్యర్థులలో ఒక్కరికి కూడా 700కి మించి మార్కులు రాలేదు. తొలిసారి ఈ సెంటర్‌లో పరీక్ష జరిగినప్పుడు ఆరుగురు అభ్యర్థులకు 720కి 720 మార్కులు వచ్చాయి. కానీ శనివారం ఎన్‌టీఏ విడుదల ఫలితాల ప్రకారం.. అక్కడ రిజల్ట్ మారిపోయింది. ఆ కేంద్రంలో అత్యధిక స్కోరు 682కు తగ్గిపోయింది. ఈసారి ఆ ఎగ్జామ్ సెంటర్ పరిధిలో ఒకే ఒక విద్యార్థికి ఈ మార్కులు(682) వచ్చాయి. కేవలం ఇద్దరికే 650కిపైగా మార్కులు వచ్చాయి. 13 మంది విద్యార్థులకు 600కుపైగా మార్కులు వచ్చాయి. ఈ పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు వచ్చిన సగటు స్కోర్ 232.60 మాత్రమే . ఇక్కడ ఎగ్జామ్ రాసిన దాదాపు 61 శాతం మంది అభ్యర్థులకు 100 నుంచి 300 మధ్యే మార్కులు వచ్చాయి. తొలుత విడుదలైన ఫలితాలకు, వీటికి మధ్య భారీ వ్యత్యాసం ఉండటం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed