ఎన్డీయే లోక్‌సభ స్పీకర్ అభ్యర్థిపై నేడే క్లారిటీ

by S Gopi |   ( Updated:2024-06-24 14:39:30.0  )
ఎన్డీయే లోక్‌సభ స్పీకర్ అభ్యర్థిపై నేడే క్లారిటీ
X

దిశ, నేషనల్ బ్యూరో:లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్డీఏ అభ్యర్థిని మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది. జూన్ 26న జరగనున్న స్పీకర్ ఎన్నికకు ఒకరోజు ముందు ఎన్డీఏ తమ అభ్యర్థిని వెల్లడించవచ్చని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ సభలో పేరును ప్రతిపాదించనున్నారు. దీనికి అన్ని పార్టీలు మద్దతివ్వనున్నాయి. ఒకవేళ ఎన్డీఏ అభ్యర్థిని ప్రతిపక్షాలు అంగీకరించకపోతే మరొక పేరును ప్రాతిపాదించి, లోక్‌సభ స్పీకర్‌గా ఎవరిని నియమించాలనే దానిపై ఓటింగ్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం స్పీకర్ రేసులో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్, బీజేపీ సీనియర్ నేత రాధా మోహన్ సింగ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఉన్నట్టు సమాచారం. మరోవైపు, 17వ లోక్‌సభ స్పీకర్‌గా వ్యవహరించిన ఓం బిర్లా తన పదవికి రాజీనామా చేశారు. 18వ లోక్‌సభకు స్పీకర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆయన రాజీనామా చేశారు. కొత్తగా స్పీకర్ పదవికి నామినేషన్ వేసేందుకు మంగళవారం(జూన్ 25) మధ్యాహ్నం 12 గంటల వరకు గడువు ఉంది. జూన్ 26 లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ప్రస్తుతం లోక్‌సభలో ఎంపీల ప్రమాణ స్వీకారం కొనసాగుతోంది. సోమవారం 280 మంది ఎంపీలు ప్రమాణ చేయగా, మిగిలినవారు రేపు చేస్తారు. ఇక, లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మెహతాబ్‌ను నియమిస్తూ రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ సమర్థించింది. ఎక్కువకాలం పార్లమెంటు సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌ను నియమించాలనే సంప్రదాయానికి అనుగుణంగా ఇది జరిగింది. అయితే, ప్రతిపక్షం మాత్రం భర్తృహరి వరుసగా ఏడోసారి విజయం సాధించారని, కేరళకు చెందిన కె సురేష్ ఎనిమిదోసారి గెలిచినందున ఆయనను ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకోవాలని తెలిపింది. అయితే, సురేష్ వరుసగా నాలుగోసారి మాత్రమే ఎంపీగా గెలిచారని బీజేపీ వాదిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed