Jagadish Urikey: బాంబు బెదిరింపుల వెనుక పుస్తక రచయిత ?

by Rani Yarlagadda |   ( Updated:2024-10-29 08:25:55.0  )
Jagadish Urikey: బాంబు బెదిరింపుల వెనుక పుస్తక రచయిత ?
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో దేశంలో వివిధ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికీ విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. సోమవారం కూడా 62 విమానాలకు బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఎయిర్ ఇండియా (21), ఇండిగో (21), విస్తారా (20) బాంబు బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియా ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఎయిర్ ఇండియాకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. వరుసగా వస్తున్న బాంబు బెదిరింపులు దేశమంతా కలకలం రేపాయి. 13 రోజుల్లో 300 పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ప్రయాణికులు సైతం విమానాల్లో ప్రయాణించాలంటే జంకుతున్నారు.

తాజాగా.. ఈ బాంబు బెదిరింపుల వెనుక ఓ పుస్తక రచయిత ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. నాగ్ పూర్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసేందుకు గాలిస్తున్నారు. అతనెవరో కాదు. పుస్తక రచయిత జగదీష్ యూకీ (Jagadish Uikey). మహారాష్ట్రలోని గోండియాకు చెందిన జగదీష్ (35) ఇటీవల ఈ-మెయిల్ ద్వారా ఫేక్ బాంబు బెదిరింపులకు పాల్పడినట్లు నాగ్ పూర్ పోలీసులు గుర్తించారు. గతంలో అతను ఉద్రవాదంపై ఓ పుస్తకం రాయగా.. 2021లో ఒక కేసులో అరెస్టయ్యాడని పోలీసులు తెలిపారు. ఇటీవల జగధీష్ చేసిన బాంబు బెదిరింపుల కారణంగా.. పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. చివరికి పీఎం ఆఫీస్, రైల్వే మంత్రి, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, డీజీపీ, ఆర్పీఎఫ్ కార్యాలయాలు సహా.. ప్రభుత్వ సంస్థలకు సైతం అతను బాంబు బెదిరింపు మెసేజ్ లు పంపాడు.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis)కు సైతం బాంబు బెదిరింపులు రావడంతో.. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. తనకు తెలిసిన రహస్య ఉగ్రవాద కోడ్ పై మాట్లాడేందుకు, ప్రధాని మోదీతో చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని ఆ బెదిరింపుల్లో జగదీష్ పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం అతను పరారీలో ఉండటంతో.. అతనికోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అక్టోబర్ 26 వరకూ 300 విమానాలకు బాంబు బెదిరింపులు రాగా.. అక్టోబర్ 22న ఒక్కరోజే 50 విమానాలకు బెదిరింపులు వచ్చాయి.

Advertisement

Next Story

Most Viewed