2వేలు దాటిన మయన్మార్ మృతుల సంఖ్య

by John Kora |
2వేలు దాటిన మయన్మార్ మృతుల సంఖ్య
X

- 3,900 మందికి గాయాలు

- ఆచూకీ లేని 270 మంది

- భూకంప ప్రభావాన్ని ఫొటోలు తీసిన ఇస్రో శాటిలైట్లు

దిశ, నేషనల్ బ్యూరో: మయన్మార్‌లో సంభవించిన ఘోర భూకంపంలో మృతుల సంఖ్య 2వేలు దాటిపోయింది. సోమవారం నాటికి 2,056 మంది చనిపోయారని, 3,900 మందికి పైగా గాయపడ్డారని సైనికాధికారులు తెలిపారు. మరో 270 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని చెప్పారు. మయన్మార్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా భారీగా ఆస్తినష్టం కూడా కలిగింది. ఇప్పటికే కూలిపోయిన భవనాల శిథిలాల్లో ఎవరైనా చిక్కుకొని పోయారేమో అని గాలింపు చర్యలు కూడా కొనసాగిస్తున్నారు. ఇక వారం రోజుల పాటు జాతీయ సంతాపదినాలను కూడా మయన్మార్ ప్రభుత్వం ప్రకటించింది. ఒక హోటల్ శిథిలాల నుంచి ఓ మహిళలను బయటకు తీసినట్లు అధికారులు వెల్లడించారు. మండలేలోని గ్రేట్ వాల్ హోటల్ శిథిలాల నుంచి ఒక మహిళను సురక్షితంగా రక్షించామని.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు.

బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న భారీ భవనం కూలిపోవడంతో దాని కింద 76 మంది చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికే వారి ఆచూకీ కోసం అత్యవసర సహాయక బృందాలు అన్వేషణ కొనసాగిస్తున్నాయి. అంతర్యుద్దం కారణంగా ఇప్పటికే గందగోళ పరిస్థితుల్లో ఉన్న మయన్మార్‌లో భూకంపం మరింత క్లిష్ట పరిస్థితుల్లోకి నట్టేసింది. 23వేల మంది బాధితుల కోసం భారత్ సహా అనేక దేశాలు టన్నుల కొద్దీ సహాయ సామాగ్రిని పంపించాయి.

ఫొటోలు తీసిన ఇస్రో శాటిలైట్లు..

మార్చి 28న మయన్మార్‌లో సంభవించిన ఘోర భూకంపం తర్వాత జరిగిన నష్టానికి సంబంధించిన ఫొటోలను ఇస్రో శాటిలైట్లు తీశాయి. మయన్మార్‌లో రెండో అతిపెద్ద నగరమైన మండలే సమీపంలో ఈ భూకంప తీవ్రత కారణంగా బ్రిడ్జిలు, భవనాలు ధ్వంసమయ్యాయి. భూకంప కేంద్రం సాగైంగ్-మాండలే సరిహద్దుకు సమీపంలో కేవలం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిసింది. భూకంపం తర్వాత ఇస్రోకు చెందిన కార్టోశాట్-3 నుంచి ఉపగ్రహ చిత్రాలను శాస్త్రవేత్తలు తీసుకున్నారు. అందులో భూకంపానికి ముందు, ఆ తర్వాత ఎలాంటి ప్రభావం ఉందో స్పష్టంగా తెలుస్తున్నాయి. సాగింగ్ ఫాల్ట్ వెంబడి భారత్, యూరేషియా టెక్టోనిక్ ప్లేట్ల మధ్య సంభవించిన కదలికల వల్లే భూకంపం సంభవించినట్లు తెలిసింది. దీంతో భవిష్యత్‌లో భౌగోళిక అస్థిరత గురించి ఆందోళన కూడా ప్రారంభమైంది.

Next Story

Most Viewed