‘నా మాటలు వక్రీకరించారు’.. నిత్యానందను భారత్‌లో వేధించింది నిజమే! (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-03 08:20:31.0  )
‘నా మాటలు వక్రీకరించారు’.. నిత్యానందను భారత్‌లో వేధించింది నిజమే! (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామికి చెందిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ సమావేశంలో పాల్గొనడంపై దుమారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కైలాస ప్రతినిధులను యూఎన్ సమావేశాలకు అనుమతి ఇవ్వడంపై భారత్‌లో విమర్శలు వ్యక్తం అవుతున్న వేళ కైలాస శాశ్వత ప్రతినిధిగా చెప్పబడుతున్న మాత విజయప్రియ నిత్యానంద మరో సంచలన వీడియో రిలీజ్ చేశారు.

భగవాన్ నిత్యానంద పరమశివం ఆయన తన జన్మస్థలంలో వేధింపులకు గురయ్యారని మరోసారి ఆరోపణలు గుప్పించారు. నిత్యానంద తాను పుట్టిన భారత్‌లో హిందూ వ్యతిరేక శక్తులు హింసించాయని మరోసారి స్పష్టం చేస్తున్నట్టు ఈ వీడియోలో పేర్కొన్నారు. ఇదే సమయంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస భారతదేశాన్ని ఎంతో గౌరవిస్తుందని భారత్‌ను తమ గురుపీఠంగా భావిస్తామన్నారు. తమ దైవం నిత్యానందను హింసించిన హిందూ వ్యతిరేక శక్తులపై మాత్రం భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

యూఎన్‌లో తమ ప్రకటనను కొన్ని హిందూ వ్యతిరేక మీడియా వర్గాలు తప్పుగా అర్థం చేసుకున్నాయని, ఉద్దేశపూర్వకంగా తన వ్యాఖ్యలను తారుమారు చేస్తూ వక్రీకరించాయన్నారు. కాగా కైలాస ప్రతినిధి యూఎస్ సమావేశంలో హాజరు కావడంపై విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ (ఓహెచ్ సీహెచ్ఆర్) స్పందించింది. ఇటీవల నిర్వహించిన రెండు సమావేశాల్లో కైలాస ప్రతినిధులు పాల్గొన్నట్లు స్పష్టం చేసింది.

అయితే కైలాస ప్రతినిధులు చేసిన సూచనలను ఐరాస కొట్టిపారేసింది. అవి అసంబంధమైనవని, తుది ముసాయిదాలో వాటిని పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 22, 24 తేదీల్లో జరిగిన ఆ భేటీలో పాల్గొనేందుకు స్వచ్ఛంద సంస్థలు, సాధారణ ప్రజలకు అనుమతించామనని తెలిపింది. అయితే ఈ ఉదంతంపై భారత మాజీ శాశ్వత ప్రతినిధి టి.ఎస్. తిరుమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed