హిజాబ్‌పై తాజా తీర్పుతో ముస్లీమ్ అమ్మాయిల‌ చ‌దువు ఆగిన‌ట్లేనా?!

by Sumithra |
హిజాబ్‌పై తాజా తీర్పుతో ముస్లీమ్ అమ్మాయిల‌ చ‌దువు ఆగిన‌ట్లేనా?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః భిన్న‌త్వంలో ఏక‌త్వ‌మ‌ని చాటుకున్న భార‌తదేశంలో విద్య‌కు మ‌తం రంగు అంటింది. రామ‌రాజ్యాన్ని పాఠ్యాంశాల్లో పెట్టిన‌ సంస్కృతి, ఈ రాజ్యంలోని స‌మాన హ‌క్కులపై స‌మ‌గ్ర పాఠం బోధించ‌లేక‌పోయింది. మొత్తానికి విద్యాల‌యాల్లో మ‌తానికి చెందిన గుర్తులు తీసుకురావ‌ద్ద‌ని క‌ర్నాట‌క అత్యున్న‌త న్యాయ‌స్థానం తాజాగా తీర్పునిచ్చింది. కాగా, మ‌తం కోసం మార‌ణ‌హోమానికి కూడా తెగ‌బ‌డిన ఈ దేశంలో ఓ మ‌తానికి చెందిన స్త్రీలు మ‌ళ్లీ వంటింటికే ప‌రిమిత‌మ‌య్యే ప‌రిస్థితులు ఏర్ప‌డ‌తాయా..? అనే సందేహం బ‌య‌ట‌కొచ్చింది. 'పితృస్వామ్య బంధీఖానాల నుండి ఎన్నో పోరాటాలు చేసి, ఓటు హ‌క్కు, విద్యా హ‌క్కు, ఉద్యోగ హ‌క్కును పొంది, రాజ‌కీయ, సామాజిక, సాంకేతిక అంశాల్లో అత్యున్న‌త స్థాయికి ఎదుగుతున్న మ‌హిళ‌ల‌పై అడుగడుగునా ఏదో ఒక‌ భ‌స్మాసుర హ‌స్తం అడ్డొస్తూనే ఉంది..' అంటున్నారు క‌ర్నాట‌క‌లో కొంద‌రు మ‌హిళా కార్య‌కర్త‌లు.

విద్యాల‌యాల్లో విద్యార్థుల మ‌ధ్య‌ స‌మాన‌త్వం కోసం ఏర్పాటు చేసిన యూనీఫాంను కాకుండా, బుర్ఖాలు, హిజాబ్‌లు ధ‌రించ‌కూడ‌ద‌ని తాజా తీర్పు వెల్ల‌డించింది. ముస్లిం మహిళలు పాఠ‌శాల‌లో అడుగుపెట్టాలంటే హిజాబ్‌ను తీసేసి రావాల్సిందేన‌ని ఆదేశం జారీ చేసింది కోర్టు. ఇస్లామిక్ విశ్వాసంలో హిజాబ్ అవసరమైనదేమీ కాద‌నీ, మతపరమైన ఆచరణలో హిజాబ్‌ భాగమే కాదనే అభిప్రాయాన్ని కోర్టు పరిగణించింది. విద్యాసంస్థలు సూచించిన యూనిఫామ్‌పై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేయ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. అయితే, ఈ తీర్పు త‌ర్వాత క‌ర్నాట‌క‌లో ముస్లీమ్ విద్యార్థుల్లో ఆవేద‌న, ఆందోళ‌న రెట్టింప‌య్యింది. హిజాబ్ సంగ‌తి అటుంచితే, దాన్ని తీసేయ‌డానికి నిరాక‌రించే కుటుంబం పిల్లల్ని చ‌దువుకోడానికే పంప‌ద‌నే భ‌యం వారిలో మ‌రింత పెరిగింది. ఈ సంద‌ర్భంగా దేశ‌వ్యాప్తంగా, ముఖ్యంగా బెంగ‌ళూరులోని ప‌లువురు విద్యార్ధులు దీనిపై స్పందించారు.

ముఖానికి వేసుకునే హిజాబ్ వంటికున్న యూనీఫామ్‌ను క‌వ‌ర్ చేయ‌నంత వ‌ర‌కూ దానిని అనుమ‌తించాల‌ని కొంద‌రు వాదిస్తుండగా... 'కొన్ని స్కూళ్ల‌ల్లో మోకాళ్ల వ‌ర‌కే ఉండే యూనీఫామ్‌లు మ‌న భార‌తీయ సంస్కృతిలో స్త్రీలు ధ‌రించొచ్చా...? లేక వాటిని కూడా మ‌డిమ‌ల వ‌ర‌కూ చేసే తీర్పులేమైనా వ‌స్తాయా..?!' అంటూ బెంగ‌ళూరుకు చెందిన ఓ విద్యార్థిని ప్ర‌శ్నిస్తోంది. నార్త్ బెంగళూరుకు చెందిన మరో ఇంజినీరింగ్ విద్యార్థిని సఫీనా మాట్లాడుతూ, హిజాబ్ ధరించడం ఎవరికీ హాని కలిగించదని, "తలపైన‌ కప్పే గుడ్డ ముక్క ఎవరికైనా ఎలా సమస్య‌ అవుతుంది?" అని అడుగుతోంది. ఇక‌, ముస్లీములే కాకుండా త‌ల‌పాగా ధ‌రించే సిక్కు అమ్మాయిలు కూడా ఇలాంటి తీర్పుతో పాఠ‌శాల‌కు దూరం కావాల్సి వ‌స్తుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. విద్యాల‌యాల్లో మ‌త గుర్తులకు అనుమ‌తి లేన‌ప్పుడు, కార్యాల‌యాల గోడ‌ల‌పై దేవుళ్ల ఫొటోలు, క్యాలండ‌ర్లు, అలాగే స్కూలుకొచ్చేట‌ప్పుడు నుదిటిపైన కుంకుమ బొట్లు, వీభూది తిల‌కాల వంటి మ‌త‌ప‌ర‌మైన శుభసూచిక‌లు ఉండాలా వ‌ద్దా అనేదానిపైన కోర్టు మ‌రింత స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని కొంద‌రు వాదిస్తున్నారు.

ఏది ఏమైనా, ఈ ప‌రిణామం ఎంతో మంది మ‌హిళ‌ల్ని తిరిగి ఇంటికే ప‌రిమితం చేసే దిశ‌గా ప‌రిణ‌మిస్తుందేమోన‌నే అనుమానాలు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Advertisement

Next Story