- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Murmu : ప్రజాస్వామ్యంపై విశ్వాసం కలిగి ఉండాలి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

దిశ, నేషనల్ బ్యూరో: ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యంపై విశ్వాసం కలిగి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi murmur) సూచించారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేప్పుడు సంకుచిత మనస్తత్వం, వివక్ష, ప్రలోభాలకు అతీతంగా ఎదగాలనే దృఢ సంకల్పాన్ని కలిగి ఉండాలని తెలిపారు.15వ జాతీయ ఓటర్ల దినోత్సవం (National Voters Day) సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. అవగాహన ఉన్న ఓటర్లే ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తారని నొక్కి చెప్పారు. భారత ప్రజాస్వామ్యం ప్రపంచ సమాజానికి ఉదాహరణగా నిలుస్తుందనే పూర్తి నమ్మకం తమకు ఉందన్నారు. పోలింగ్‌లో నూతన సాంకేతికత, సరికొత్త సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి పని చేస్తున్న ఎలక్షన్ కమిషన్‌ను ప్రశంసించారు. పోల్ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు.
మన ప్రజాస్వామ్యం అతి పెద్దది మాత్రమే గాక పురాతనమైనది కూడా కావడం మనకు గర్వకారణమని చెప్పారు. ఎన్నికల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం దేశ అభివృద్ధికి ఒక ముఖ్యమైన సంకేతమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ (Arjunram megwal) , చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ (Rajeev kumar), ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, ఎస్ఎస్ సంధు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్ర, జిల్లా అధికారులకు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డులను ముర్ము అందజేశారు. కాగా, 1950 జనవరి 25న దేశంలో ఎన్నికల సంఘాన్ని స్థాపించారు. ఓటర్లకు తమ ఓటు హక్కుపై అవగాహన కల్పించే లక్ష్యంతో 15 ఏళ్లుగా జాతీయ ఓటర్ల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.